గాజా క్షామంలో కూరుకుపోయినట్లు ఐరాస శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఐదు లక్షలమంది ప్రజలు ఆకలిమంటల్లో కాలిపోతున్నారని, పశ్చిమాసియాలో ఈ స్థాయి దుర్భిక్ష పరిస్థితులు కనిపించడం ఇదే తొలిశారని పేర్కొంది. ఈ క్షామాన్ని పూర్తిగా నివారించవచ్చు. ఇజ్రాయెల్ దశలవారీగా అడ్డంకులు సృష్టిస్తుండటంతో ఆహారం ఇక్కడ ప్రజలకు చేరడం సాధ్యంకావడం లేదని యూఎన్ ఎయిడ్ చీఫ్ టామ్ ఫ్లెట్చర్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. అయితే ఈ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ ఖండించింది. ఇది స్వార్థ ప్రయోజనాలతో కూడిన నివేదిక అని మండిపడింది. కాగా గాజాలో మానవతా పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయని ఐరాస కొంతకాలంగా హెచ్చరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జులై ఒకటి నుంచి ఆగస్టు 15 వరకు సేకరించిన సమాచారం ఆధారంగా క్షామం గురించి తాజాగా ప్రకటన చేసినట్లు పేర్కొంది. సెప్టెంబర్ నాటికి ఆకలితో ఆలమటించేవారి సంఖ్య 6,41,000కు చేరొచ్చని తెలిపింది. మరోవైపు హమాస్ ఆయుధాలు విడిచిపెట్టకపోతే గాజా నగరాన్ని నాశనం చేస్తామని ఇజ్రాయెల్ మరోసారి హెచ్చరించింది. హమాస్ తమ దారికి రాకపోతే గాజా విధ్వంసం తప్పదని, వారికి నరకదారులు తెరుచుకుంటాయని ఇజ్రాయెల్ రక్షణమంత్రి ఇజ్రాయెల్ కట్జ్ వ్యాఖ్యానించారు. వెంటనే తమ బందీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునే ప్రణాళికకు ఆమోదం తెలిపిన ప్రధాని నెతన్యాహు ఇందుకోసం మరో ఆపరేషన్ చేపడతామన్నారు. హమాస్‌ను అంతం చేయడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు.
గాజాలో ఐదు లక్షల మంది ఆకలిమంటల్లో కాలిపోతున్నారన్న ఐరాస
August 22, 2025
0
Tags