చైనాలో సీనియర్‌ దౌత్యవేత్త లియు జియాంచావ్‌ అరెస్టు

Telugu Lo Computer
0


చైనాలో కీలక నాయకుల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. భవిష్యత్తులో మంత్రి పదవి చేపడతారనుకొన్న ఓ దౌత్యవేత్త ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు. లియు జియాంచావ్‌ అనే సీనియర్‌ దౌత్యవేత్తను అధికారులు అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఆదివారం కథనం ప్రచురించింది. లియు భవిష్యత్తులో విదేశాంగ మంత్రి పదవి చేపట్టొచ్చని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది జులైలో లియు ఓ విదేశీ పర్యటన ముగించుకొని బీజింగ్‌ తిరిగి రాగానే అధికారులు ఆయన్ను బంధించినట్లు వాల్‌స్ట్రీట్‌ వెల్లడించింది. తాజాగా ఈ అంశంపై స్టేట్‌ కౌన్సిల్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీస్‌ వెంటనే ఎటువంటి కామెంట్‌ చేయలేదు. 61 ఏళ్ల లియు కమ్యూనిస్టు పార్టీ విదేశీ రాజకీయ పక్షాలతో సంబంధాలు నిర్వహించే సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన 2022లో ఈ పదవి చేపట్టారు. దాదాపు 20 దేశాల్లో పర్యటించారు. 160 దేశాల ప్రతినిధులతో సమావేశమైన అనుభవం ఉంది. 2023లో అక్రమ సంబంధం కారణంగా మాజీ విదేశాంగ మంత్రి క్విన్‌గాంగ్‌ అరెస్టు తర్వాత.. ఆ స్థాయి దౌత్యవేత్తను అదుపులోకి తీసుకోవడం మళ్లీ ఇదే. ఈశాన్య ప్రాంతంలోని జిలిన్‌ ప్రావిన్స్‌లో లియు జన్మించారు. బీజింగ్‌ ఫారెన్‌ స్టడీస్‌ యూనివర్శిటీలో ఇంగ్లిష్‌లో మేజర్‌ పూర్తి చేశారు. ఆక్స్‌ఫర్డ్‌లో అంతర్జాతీయ సంబంధాలపై విద్యాభ్యాసం చేశారు. విదేశాంగశాఖలో అనువాదకుడిగా కెరీర్‌ను ప్రారంభించారు. బ్రిటన్‌లోని దౌత్య కార్యాలయంలో, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లో చైనా రాయబారిగా పనిచేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)