ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాల్లో 'అడవి తల్లి బాట' పేరిట చేపట్టిన నూతన రహదారుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, పనులు పూర్తయితే 625 గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యం ఏర్పడుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోడ్ల నిర్మాణంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, రెండు వారాలకోసారి శాఖాపరంగా సమీక్షించి నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో రహదారి పనుల స్థితిగతులపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి, కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులతో పవన్ ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీఎం జన్ మన్ పథకంతో పాటు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఉప ప్రణాళిక నిధులు కలిపి రూ.1005 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు. 'అడవి తల్లి బాట' పేరుతో రెండు దశల్లో చేపట్టిన పనుల్లో స్వాతంత్ర్యం వచ్చాక ఇప్పటి వరకు రహదారి సౌకర్యం లేని గిరిజన ఆవాసాలను సైతం అనుసంధానించేలా రోడ్లు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పవన్‌కు అధికారులు తెలిపారు. ఈ పనుల పురోగతిని వివరిస్తూ పనులు వేగంగా చేయడానికి ఎదురవుతున్న సవాళ్లను, అవరోధాలను వివరించారు. కొండలపై ఉన్న ఆవాసాలను అనుసంధానిస్తూ కొత్త రోడ్డు రూపకల్పన చేసేందుకు బండరాళ్లను బద్దలు కొడుతూ ముందుకు వెళ్లేందుకు అధిక సమయం పడుతోందన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తూ ఉండటంతో పనుల వేగం తగ్గింద్దన్నారు. 128 రోడ్లు.. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఉండడం వల్ల అటవీశాఖ అనుమతులు కోరగా ఇప్పటికే 98 రోడ్లకు వచ్చాయని వెల్లడించారు. ఇప్పటి వరకు 186 పనులు చేపట్టగా, మరో 20 పనులు టెండర్ దశలో ఉన్నట్టు అధికారులు వివరించారు. గిరిజన ప్రాంతాల్లో చేపట్టిన ఈ పనుల గురించి స్థానికులకు కూడా తెలియజేయడం ఎంతో అవసరమని పవన్ అన్నారు. డోలీరహిత ఆవాసాలు ఉండాలనే సంకల్పంతో చేపట్టిన విషయాన్ని వారికీ చెప్పాలని తద్వారా వారి సహకారం, ప్రోత్సాహం కూడా లభిస్తుందని చెప్పారు.
గిరిజన ప్రాంత ప్రజలకు 'అడవి తల్లి బాట' గురించి చెప్పండి!
August 10, 2025
0
Tags