కశ్మీర్‌లోని కుల్గామ్‌లో భద్రతాదళాలు చేపడుతున్న ఉగ్రవాద ఏరివేత చర్యలు తమపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను మరో ప్రాంతానికి తరలించాలంటూ జిల్లాలోని అఖాల్ గ్రామస్థులు అభ్యర్థిస్తున్నారు. గత వారం రోజులుగా నిరంతరం కొనసాగుతున్న కాల్పులు, బాంబు పేలుళ్ల శబ్దాలతో తమకు కంటి మీద కునుకు లేకుండా పోతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'రాత్రి వేళ కూడా కాల్పులు, బాంబు పేలుళ్ల మోతతో నిద్ర కూడా పోవడం లేదు. ఇళ్లల్లోని నిత్యావసరాలు కూడా నిండుకుంటున్నాయి. పిల్లలు కూడా భయాందోళనలకు లోనవుతున్నారు. రాత్రిళ్లు రోదిస్తున్నారు. ఔషధాలు, నిత్యావసరాల కొరత ఏర్పడింది. సమీపంలో నివసించే సంచార జాతుల వారు కూడా నిత్యావసరాల కొరతతో సతమతమవుతున్నారు' అని స్థానికుడు ఒకరు వాపోయారు. ఈ కష్ట సమయంలో గ్రామాధికారులు తమకు చేతనైన మేరకు నిత్యావసరాలు అందిస్తున్నారని కూడా అన్నారు. అవసరమైన సందర్భాల్లో అంబులెన్స్ ఏర్పాటు చేసిన ఎస్ఎస్‌పీకి వారు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే తమ గ్రామం నుంచి అనేక మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారని గ్రామస్థులు తెలిపారు. మిగిలిన తమను కూడా ఇతర ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. అఖాల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగున్నారన్న సమాచారం అందడంతో ఆగస్టు 1న భద్రతా దళాలు ఉగ్రవాద ఏరివేత ఆపరేషన్‌ను ప్రారంభించాయి. అత్యాధునిక సర్వేలెన్స్ ఉపకరణాలు, డ్రోన్స్‌తో నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకూ ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఏడాది కశ్మీర్‌లో భద్రతా దళాలు నిర్వహించిన అత్యంత సుదీర్ఘ ఆపరేషన్ ఇదేనని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కశ్మీర్‌లో ఉగ్రవాద ఏరివేత చర్యలతో స్థానికుల అష్టకష్టాలు !
August 07, 2025
0
Tags