హీరోగా సినీ ప్రయాణం ప్రారంభించిన సత్యరాజ్ ఇప్పుడు సహాయ నటుడిగా రాణిస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్యపాత్రలలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. రీసెంట్ గానే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కూలీ' సినిమాలో నటించారు. ఈ సినిమాలో రజినీ - సత్యరాజ్ ఫ్రెండ్స్ గా కనిపించారు. అలానే ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, కన్నడ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ షాహిర్, శృతి హాసన్, పూజా హెగ్డే ముఖ్యపాత్రలు పోషించారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ భారీ హిట్ అందుకుంది. అయితే రజినీకాంత్ సినిమాలో తాను నటించనని 18 ఏళ్ల క్రితం ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. కెరీర్ మొదట్లో సత్యరాజ్, రజినీకాంత్ కలిసి " మిస్టర్ భరత్ " అనే సినిమాలో నటించారు. 1986లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. దీనిలో రజినీకి సత్యరాజ్ తండ్రిగా నటించాడు. ఈ సినిమా తరువాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా మారాడు. అయితే ఆ తర్వాత వీరి మధ్య గ్యాప్ పెరిగిందని అంటుంటారు. అందుకే శివాజీ సినిమాలో సుమన్ పాత్ర మొదట సత్యరాజ్ వద్దకు వెళ్లగా, ఆయన నిరాకరించారని చెబుతారు. సత్యరాజ్ ని శంకరే స్వయంగా అడిగినా కూడా ఒప్పుకోలేదని అంటారు. తాము ఎంత కష్టపడి నటించినా రజినీ తన స్టైల్ తో సినిమా మొత్తాన్ని తనవైపునకు తిప్పేసుకుంటాడు. అందుకే రజినీ సినిమాలు ఇక నుంచి చేయను అని సత్యరాజ్ తెగేసి చెప్పాడట. దీంతో అప్పట్లో ఆయనపై చాలా విమర్శలు వచ్చాయి. సూపర్ స్టార్ కూడా సత్యరాజ్ తో విభేదాల గురించి స్టేజీపైనే ఓపెన్ అయ్యారు. అయితే అప్పటి వివాదానికి సత్యరాజ్ తాజాగా ఫుల్ స్టాప్ పెట్టాడు. అప్పట్లో తాను అన్నానని బయటికి వచ్చిన వ్యాఖ్యలన్ని అవాస్తవమని సత్యరాజ్ కొట్టిపారేశారు. తాను ఏరోజు అలా మాట్లాడలేదని, శివాజీ సినిమాను రిజెక్ట్ చేయడానికి వేరే కారణం ఉందన్నారు. శివాజీ సినిమా చేసే సమయంలోనే నేను హీరోగా నిలదొక్కుకుంటున్నానని, అప్పుడు ఆ పాత్రను ఒప్పుకుంటే ఆ తరువాత కూడా అలాంటి పాత్రలే వస్తాయని భయపడ్డానన్నారు. అందుకే ఆ పాత్రను వదులుకున్నానని, కానీ పత్రికల్లో ఏవేవో రాసారని అన్నారు.
హీరోగా నిలదొక్కుకుంటున్న సమయంలో శివాజీ సినిమా ఆఫర్ వచ్చింది : సత్యరాజ్
August 29, 2025
0
Tags