పోలాండ్‌ ఎయిర్‌షో రిహార్సల్స్‌లో కుప్పకూలిన ఎఫ్-16 ఫైటర్ జెట్

Telugu Lo Computer
0


సెంట్రల్ పోలాండ్‌ లోని రాడోమ్ నగరంలో జరుగుతున్న ఎయిర్‌షో రిహార్సల్స్‌లో భాగంగా పోలిష్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్ కుప్పకూలింది . ఈ ఘటనలో విమానాన్ని నడుపుతున్న పైలట్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని దేశ ఉప ప్రధాన మంత్రి వ్లాడిస్లావ్ కొసినియాక్-కామిస్జ్ అధికారికంగా ధృవీకరించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గాల్లో బ్యారెల్-రోల్ విన్యాసం చేయడానికి ప్రయత్నించిన యుద్ధవిమానం ఒక్కసారిగా అదుపుతప్పి నేలవైపు దూసుకెళ్లింది. క్షణాల్లోనే రన్‌వేపై కూలిపోయి భారీ అగ్నిగోళంగా మారింది. మంటల్లో చిక్కుకున్న విమానం కొన్ని మీటర్ల దూరం దూసుకెళ్లిన దృశ్యాలు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై పోలాండ్ ఉప ప్రధాని వ్లాడిస్లావ్ ఎక్స్ వేదికగా స్పందించారు. పైలట్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ 'ఎఫ్-16 విమాన ప్రమాదంలో పోలిష్ ఆర్మీ పైలట్ వీర మరణం చెందారు. ఆయన ధైర్యసాహసాలు, అంకితభావం మాతృభూమికి చేసిన గొప్ప సేవ. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. కుటుంబ సభ్యులకు, ఆప్తులకు నా ప్రగాఢ సానుభూతి' అని పేర్కొన్నారు. ఈ ప్రమాదం వెనుక కారణాలను వెలికితీసే ప్రయత్నంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)