నెలపాటు మణిరత్నం వెంటపడ్డా : నాగార్జున

Telugu Lo Computer
0


టుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్‌ షో 'జయమ్ము నిశ్చయమ్మురా'. తొలి ఎపిసోడ్‌లో నాగార్జున సందడి చేశారు. సరదా సంగతులు పంచుకుంటూనే కెరీర్‌ ప్రారంభ రోజులు గుర్తుచేసుకున్నారు. సినిమా అవకాశం కోసం దర్శకుడు మణిరత్నం వెంట పడ్డానని గుర్తుచేసుకున్నారు. ''నేను నటించిన తొలి సినిమాలను 'నాగేశ్వరరావు అబ్బాయి' అన్న ఉద్దేశంతో ప్రేక్షకులు చూశారు. కొందరు మెచ్చుకున్నారు. మరికొందరికి నేను నచ్చలేదు. తర్వాత, చేయమంటున్నారు కదా అని ఆరేడు చిత్రాల్లో నటించా. ఆ క్రమంలో వచ్చిన.. 'మజ్ను' సినిమా బ్రేక్‌ ఇచ్చింది. 'నాగార్జునలో నటుడు ఉన్నాడు' అని ప్రేక్షకులతో అనిపించింది. కమర్షియల్‌ చిత్రాల్లో 'ఆఖరి పోరాటం' విజయవంతమైంది. దర్శకుడు రాఘవేంద్రరావు, హీరోయిన్‌ శ్రీదేవి వల్లే అది సాధ్యమైంది. ఆ సినిమాలో నేనొక బొమ్మలా ఉన్నానంతే. నాకు నచ్చిందే చేయాలని ఫిక్స్‌ అయిపోయా. మణిరత్నం దర్శకత్వం వహించిన 'మౌనరాగం' నాకు బాగా నచ్చింది. ఆయన తెరకెక్కించే సున్నితమైన కథలకు నేనూ సరిపోతానని అనుకున్నా. ఆయన వాకింగ్‌కు వెళ్లే పార్క్‌ వివరాలు తెలుసుకుని, నెలపాటు ఆయన వెంటపడ్డా. పది నిమిషాలపాటు కలిసి నడిచిన తర్వాత ఆయన టెన్నిస్‌ ఆడేందుకు వెళ్లిపోయేవారు. చివరకు ఒప్పించా. అలా వచ్చిందే 'గీతాంజలి' చిత్రం. దాన్ని తమిళంలో తెరకెక్కించాలని ఆయన అనుకున్నారు. తెలుగులోనే తీసి, మార్కెట్‌ పెంచుకోండి అని నేను ఆయనకు సలహా ఇచ్చా. అనుకున్నట్టే నాకు హిట్‌ వచ్చింది. ఆయనకు టాలీవుడ్‌లో క్రేజ్‌ దక్కింది'' అని నాగార్జున వివరించారు. నాగార్జున, జగపతి బాబు తమ మధ్య అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తాను నటుడిగా మారేందుకు నాగార్జున ప్రోత్సాహం కారణమని జగపతిబాబు తెలిపారు. ఈ ఎపిసోడ్‌ ఓటీటీ 'జీ 5'లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)