అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రాకతో వీసాలు కష్టతరంగా మారడం, ఇరు దేశాల సంబంధాలు దెబ్బతినడం వంటి కారణాలతో ఈ పరిస్థితి తలెత్తిందని భావిస్తున్నారు. అమెరికా కామర్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం డేటా ప్రకారం ఈ ఏడాది జూన్‌లో 2.1 లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించారు. కానీ, గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 2.3 లక్షలుగా ఉంది. 8 శాతం తగ్గుదల నమోదైంది. ఇక జులైలో కూడా గతేడాదితో పోలిస్తే 5.5శాతం తగ్గుదల నమోదైంది. కేవలం భారత్ నుంచే కాకుండా మొత్తంగా అమెరికాకు అంతర్జాతీయ ప్రయాణికుల రాక కూడా తగ్గినట్లు నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం సందర్శకుల్లో అమెరికాయేతర పౌరల రాక జూన్‌లో గతేడాదితో పోలిస్తే 6.2 శాతం తగ్గింది. ఇక మేలో 7 శాతం, మార్చిలో 8 శాతం, ఫిబ్రవరిలో 1.9 శాతం పడిపోయింది. ఈ ఏడాది జనవరిలో మాత్రమే అమెరికాకు అంతర్జాతీయ సందర్శకుల సంఖ్య 4.7 శాతం, ఏప్రిల్‌లో 0.7 శాతం పెరిగింది. అమెరికా అంతర్జాతీయ పర్యటకుల మార్కెట్‌కు భారత్ నాలుగో అతిపెద్ద సోర్స్‌గా నిలిచింది. ఇక మెక్సికో, కెనడా అమెరికాతో భూ సరిహద్దును పంచుకొంటున్న దేశాలతో పోటీ పడుతోంది. అయితే.. అమెరికా పర్యాటక రంగం దిగ్గజాలు మాత్రం ట్రంప్ ప్రతిపాదించిన కఠిన వీసా నిబంధనలను ఇప్పుడే తప్పు పట్టడం తొందరపాటవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం అనుమానించాల్సిందేనని చెబుతున్నారు. అమెరికాలో 50 లక్షల మంది భారతీయులు ఉంటున్నారు. నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజంగణాంకాల ప్రకారం 2000 సంవత్సరం తర్వాత నుంచి 2025 వరకు జూన్‌లో భారత్ సందర్శకుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ సారి మాత్రమే తగ్గుదల నమోదైంది. ముఖ్యంగా విద్యార్థి విభాగం వీసాల్లో తగ్గుదల భారీగా ఉన్నట్లు ట్రావెల్ సంస్థలు చెబుతున్నాయి. వీటికి జాప్యాలే కారణమంటున్నాయి. ఇక విద్యార్థులే కాకుండా భారత్ నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు తమ మిత్రులు, కుటుంబ సభ్యులను కలిసేందుకు, వ్యాపారం నిమిత్తం అమెరికాకు వస్తుంటారు. భారతీయులు సెలవులు గడపడానికి ఇష్టపడే దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో లేదు. ఆగ్నేయాసియా, మధ్య ఆసియా, ఐరోపా తర్వాత నార్త్ అమెరికా ఉంది.
పాతికేళ్ల తర్వాత తొలిసారిగా తగ్గిన అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య
August 31, 2025
0
Tags