రెండు మూడు సంవత్సరాల్లో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు హాంఫట్ ?

Telugu Lo Computer
0


టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భారీగా కుదుపులకు లోనవుతోంది. షేక్ అవుతోంది. లేఆఫ్స్ ను ప్రకటించిన రెండు రోజుల్లో ఈ దేశీయ టెక్ దిగ్గజంలో భారీ పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. దీని ప్రభావం అటు టెక్ ఇండస్ట్రీ మొత్తం మీద పడుతోంది. వేలాదిమంది ఉద్యోగులను తొలగించాలని టీసీఎస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. రెండు రోజుల కిందటే ఈ విషయాన్ని ప్రకటించింది. తన మొత్తం ఉద్యోగుల్లో రెండు శాతం అంటే 12,200 మంది ఉద్యోగులను లేఆఫ్ కింద తొలగించనుంది. ఈ విషయాన్ని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కే కృతివాసన్ తెలిపారు. ఈ పరిణామాలు టెక్ రంగాన్ని తీవ్ర కుదుపులకు గురి చేసే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. దేశీయ సాఫ్ట్‌వేర్ రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏర్పడే దుష్పరిణామాలకు నాంది పలికింది. రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో ఈ రంగంలో సుమారు అయిదు లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తోన్నారు. నైపుణ్యం కొరత కారణంగానే లేఆఫ్స్ ప్రకటించినట్లు టీసీఎస్ చెప్పినప్పటికీ, ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఉందనడంలో సందేహాలు అక్కర్లేదు. దేశీయ ఐటీ రంగంలో బేసిక్ కోడింగ్ నుండి మాన్యువల్ టెస్టింగ్, కస్టమర్ సపోర్ట్ వరకు అన్నింట్లోనూ ఏఐ వినియోగం పెరుగుతోంది. ఈ ఏడాది మార్చి 5.67 మిలియన్ల మందికి ఉపాధి కల్పించింది దేశీయ ఐటీ రంగం. దేశ జీడీపీలో దీని వాటా ఏడు శాతం. ఏఐ వల్ల ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఈ సంఖ్య భారీగా తగ్గే ప్రమాదం ఉందని కాన్‌స్టెలేషన్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ రే వాంగ్ తెలిపారు. రాబోయే కాలంలో మరింత మంది ఉద్యోగుల తొలగింపులు ఉండవచ్చని ఆయన హెచ్చరించారు. ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీపై పెద్దగా పట్టు లేని ఉద్యోగులు, టెస్టింగ్/బగ్స్‌ను ఐడెంటిఫయర్, సేల్స్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ, మానవ వనరులు వంటి డివిజన్లు ఎక్కువగా ప్రభావితమౌతాయని రే వాంగ్ అంచనా వేశారు. ఎప్పటికప్పుడు పట్టు పెంచుకోక తప్పదని తేల్చి చెప్పారు.  రాబోయే రెండు మూడేళ్లల్లో నాలుగు నుండి 5 లక్షల మంది నిపుణుల ఉద్యోగం ప్రమాదంలో పడుతుందని టెక్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ యునెర్త్‌ ఇన్‌సైట్ వ్యవస్థాపకుడు గౌరవ్ వాసు అభిప్రాయపడ్డారు. ఈ తొలగింపుల్లో 70 శాతం మంది 4 నుంచి 12 సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగులను ప్రభావితం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. 13 నుండి 25 సంవత్సరాల అనుభవం ఉన్న 4,30,000 మందికి పైగా ఉద్యోగులు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, విప్రో, ఎల్ అండ్ టీ మైండ్ ట్రీ, కాగ్నిజెంట్ వంటివి టెక్ దిగ్గజ సంస్థల్లో పని చేస్తోన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను అడాప్ట్ చేసుకుంటోండటం వల్ల తక్కువ మంది ఉద్యోగులతో రోజువారీ కార్యకలాపాలను కొనసాగిస్తాయని జెఫెరిస్ అనలిస్ట్ అక్షత్ అగర్వాల్ చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)