కాంగోలో ఇస్లామిక్ స్టేట్ మద్దతుతో ఊచకోత : 52 మంది దారుణ హత్య

Telugu Lo Computer
0


ఫ్రికా ఖండంలోని కాంగో దేశంలో కనీవిని ఎరుగని రీతిలో మానవ హత్యలు చోటు చేసుకోవడం విషాదకరం. ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు రెచ్చిపోయి కత్తులు, గొడ్డళ్లతో సామాన్య పౌరులపై దాడి చేసి 52మందిని దారుణంగా హతమార్చారు. కాంగో సైన్యంతో ఇటీవల జరిగిన యుద్ధంలో పరాజయం పాలైన అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ సభ్యులు ప్రతీకారంగా ఈ మారణకాండకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు. నిద్రలో ఉన్న వారిని లేపి, వారి చేతులు కట్టేసి, అమానుషంగా కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపారని స్థానిక వర్గాలు తెలిపాయి. 2013 నుంచి ఇప్పటి వరకు వారి దాడుల్లో దాదాపు 6వేలమంది ప్రాణాలు కోల్పోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ దుర్మార్గపు సంస్థపై అమెరికా, ఐక్యరాజ్య సమితి భద్రతామండలి ఇప్పటికే ఆంక్షలు విధించాయి. కాగా మెలియా గ్రామం లోనే దాదాపు 30మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మొత్తం మృతుల సంఖ్యలో ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటనలో 52మంది అక్కడిక్కడే మృతి చెందగా, కొందరిని ఇళ్లలోనే కిరాతకంగా కాల్చి చంపినట్లు చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు హెచ్చరించారు. గత నెలలో కూడా ఏడీఎఫ్ తిరుగుబాటుదారులు ఒక కాథలిక్ చర్చి ప్రాంగణంలో కాల్పులు జరిపి 38మందిని బలిగొన్న విషయం గుర్తుచేశారు. స్థానిక ప్రజలు ఇంకా భయం గుప్పెట్లోనే జీవిస్తున్నారని ఇక్కడి అధికారులు తెలిపారు. ఉగాండా కాంగో సరిహద్దు ప్రాంతాల్లో చురుకుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఏడీఎఫ్ అనే ఈ తిరుగుబాటు సంస్థ, గత కొన్ని సంవత్సరాలుగా పౌరులనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతోంది. ఒకవైపు ఆకలి, కరువు మరోవైపు మతం పేరుతో జరుగుతున్న ఊచకోతతో దేశం నిత్యం సమస్యలవలంలో నలిగిపోతున్నది. అభివృద్ధి కుంటుపడుతున్నది. సమాజంలో ప్రజలు సురక్షితంగా ఉన్నప్పుడే వారు అన్నిరంగాల్లో వృద్ధి చెందగలరు. మతం పేరుతో హత్యలకు పాల్పడడం హేయమైన చర్యని ఐక్యరాజ్యసమితి పేర్కొన్నది.

Post a Comment

0Comments

Post a Comment (0)