ఇ-టికెట్లతో రైలు టికెట్‌ బుకింగ్‌ చేసుకునే ప్రయాణికులకు 45 పైసలతో ప్రయాణ బీమా సదుపాయం : అశ్వినీ వైష్ణవ్‌

Telugu Lo Computer
0


-టికెట్లతో రైలు టికెట్‌ బుకింగ్‌ చేసుకునే ప్రయాణికులు కేవలం 45 పైసల ప్రీమియంతో ప్రయాణ బీమా సదుపాయం పొందొచ్చని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. రైల్వే బీమా సదుపాయానికి సంబంధించి సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన పార్లమెంట్‌లో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రయాణికులు ఆన్‌లైన్‌ లేదా రిజర్వేషన్‌ కౌంటర్ల వద్ద తీసుకునే టికెట్‌లో ఈ ఆప్షనల్ ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ను ఎంపిక చేసుకోవచ్చన్నారు. ఈ బీమా పథకం ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్న కన్ఫర్మ్‌డ్‌/ఆర్ఏసీ ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. ఈ బీమా ప్రయోజనం పొందాలనుకునే వారు టికెట్‌ బుకింగ్‌ సమయంలో ఆప్షన్‌ను స్వయంగా ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. ఈ పథకాన్ని ఎంచుకున్న వారికి అదనపు బీమా కవరేజ్‌ లభిస్తుంది. ప్రీమియంగా 45 పైసలు మాత్రమే వసూలు చేస్తారు. ఇది టికెట్‌ ధరతో పాటు చెల్లించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. అలాగే ప్రయాణికులకు నమోదు చేసుకున్న మొబైల్ నంబర్‌, ఇ-మెయిల్‌ ఐడీకి బీమా పాలసీ వివరాలు అందుతాయని తెలిపారు. పాలసీకి సంబంధించిన నామినీ వివరాలు నమోదు చేసుకునే లింక్‌ కూడా మెసేజ్ వస్తుందని చెప్పారు. బీమా పాలసీ జారీ, క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌కు సంబంధించి బీమా సంస్థే పూర్తి బాధ్యత వహిస్తుందన్నారు. ప్రయాణికులు, బీమా సంస్థ మధ్యే ఈ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. బీమాను ఎలా క్లెయిమ్‌ చేసుకోవాలనే వివరాలు సదరు బీమా సంస్థ పంపిన మెయిల్‌లో ఉంటాయని చెప్పారు. ప్రయాణికులు నేరుగా సంస్థతోనే క్లెయిమ్‌ దాఖలు చేసి పరిష్కరించుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ ఆప్షనల్‌ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ కింద ఐదేళ్లలో మొత్తం 333 బీమా క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. రూ.27.22 కోట్లను ప్రయాణికులు లేదా వారి కుటుంబ సభ్యులకు బీమా సంస్థలు చెల్లించాయని పేర్కొన్నారు. ఈ బీమా పథకం ప్రయాణికులకు అనుకూలంగా ఉండే విధంగా రూపొందించామని, తక్కువ ఖర్చుతో అధిక ప్రయోజనం అందించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చామని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. కేవలం 45 పైసలకే ఈ బీమా లభించడంతో ఇది ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుందన్నారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో టికెట్‌ బుక్‌ చేసే సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్‌ కోసం బీమా ఆప్షన్‌ పక్కనున్న టిక్‌ బాక్స్‌ను ప్రత్యేకంగా ఎంచుకొనే పనిలేదు. ఈ ఆప్షన్‌ డిఫాల్ట్‌గా వస్తోంది. అయితే ఈ ప్రయోజనాలను వద్దనుకున్నవారు మాత్రం ఆ టిక్‌ మార్క్‌ను తీసేయొచ్చు. దీనికోసం ఎటువంటి అదనపు దరఖాస్తు గానీ, పత్రాలు గానీ అవసరం లేదని మంత్రి పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)