30 శాతం పెంచిన నిర్మాతల సినిమాల షూటింగ్స్‌కే హాజరుకావాలని తెలుగు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ నిర్ణయం

Telugu Lo Computer
0


తాము ఆశించినట్టు వేతనాన్ని 30 శాతం పెంచిన నిర్మాతల సినిమాల షూటింగ్స్‌కే సోమవారం నుంచి హాజరుకావాలని కార్మిక సంఘాల నాయకులకు తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ సూచించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కార్మికుల వేతనాల విషయంపై కొన్నిరోజులుగా ఫిల్మ్‌ ఫెడరేషన్‌- ఫిల్మ్‌ ఛాంబర్‌ మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫెడరేషన్‌ ఆదివారం సర్వసభ్య సమావేశం నిర్వహించింది. వేతనాల పెంపు విషయంలో కో- ఆర్డినేషన్‌ కమిటీ ఛైర్మన్‌లుగా వీరశంకర్‌, సయ్యద్‌ హుమయూన్‌ను నియమించారు. 30 శాతం వేతనం పెంచి ఇస్తామన్న నిర్మాతల ఒప్పంద పత్రాన్ని ఫెడరేషన్‌ ద్వారా యూనియన్‌లకు తెలియజేసిన తర్వాతే షూటింగ్స్‌కు వెళ్లాలని నిర్ణయించారు. అప్పటి వరకూ ఫిల్మ్‌ ఫెడరేషన్‌ సభ్యులెవరూ సినిమాలు, వెబ్‌సిరీస్‌ల షూటింగ్స్‌కు హాజరుకాకూడదని నిర్ణయించారు. తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కడ జరిగినా, ఇతర భాషా చిత్రాలకు పని చేయాలనుకున్నా ఈ రూల్స్‌ వర్తిస్తాయని తెలిపారు. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం ఫిల్మ్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌ చేయగా, ఫిల్మ్‌ ఛాంబర్‌ 5 శాతం పెంచేందుకు సిద్ధపడింది. దీంతో ఫెడరేషన్‌ పెంచిన వారి సినిమా షూటింగ్‌లకే వెళ్లేలా నిర్ణయం తీసుకుంది. అల్లరి నరేశ్‌ హీరోగా కొత్త సినిమా సోమవారం ప్రారంభం కానుంది. ఫెడరేషన్‌ నిర్ణయం అనంతరం ఆ చిత్ర బృందం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)