రూ.23వేల కోట్ల హవాలా సొమ్మును బాధితులకు ఈడీ చెల్లించింది : కేంద్రం

Telugu Lo Computer
0


దేశంలో మనీలాండరింగ్ నేరాలకు సంబంధించిన కేసుల దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఇప్పటివరకు రూ.23వేల కోట్ల హవాలా సొమ్మును స్వాధీనం చేసుకుంది. ఆ మొత్తాన్ని ఆర్థిక నేరాల బాధితులకు చెల్లించినట్టు సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు. దివాలా తీసిన భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ (బీపీఎస్‌ఎల్‌) ఆస్తుల విక్రయానికి అనుమతినిస్తూ ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సమీక్షించాలని అభ్యర్థనలు రావడంతో రివ్యూ పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా గురువారం విచారణ జరుగుతుండగా ఓ న్యాయవాది మాట్లాడుతూ బీపీఎస్‌ఎల్‌పై ఈడీ కేసు గురించి ప్రస్తావించారు. దీనికి సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ బదులిస్తూ 'ఇక్కడ కూడా ఈడీ ఉందా?' అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ ''ఇక్కడో వాస్తవం చెప్పాలి. ఈ విషయాన్ని ఇంతవరకూ మేం ఏ కోర్టులోనూ చెప్పలేదు. ఇప్పటివరకు ఈడీ మనీలాండరింగ్‌ కేసుల దర్యాప్తులో భాగంగా రూ.23వేల కోట్లను స్వాధీనం చేసుకుంది. ఆ మొత్తం దేశ ఖజానాలో ఉండదు. దాన్ని బాధితులకు ఈడీ చెల్లించింది'' అని వివరించారు. అయితే, ఈ కేసుల్లో శిక్షల రేటు ఎలా ఉందని సీజేఐ అడగ్గా శిక్షలు పడిన సందర్భాలు తక్కువే అని ఎస్‌జీ కోర్టుకు తెలిపారు. ''దోషులుగా తేలకపోయినా విచారణ పేరుతో సంవత్సరాల పాటు మీరు వారికి శిక్ష వేస్తున్నారు కదా'' అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)