రాపిడో తప్పుడు ప్రకటనలు ఇచ్చినందుకు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కఠిన చర్యలు తీసుకుంది. వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్రకటనలను ప్రసారం చేసినందుకు కంపెనీపై రూ.10 లక్షల జరిమానా విధించింది. ఆ ప్రకటనల వల్ల ప్రభావితమైన కస్టమర్లకు పూర్తి మొత్తంలో వాపసు చెల్లించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. రాపిడో కంపెనీ గ్యారంటీడ్ ఆటో అంటూ 5 నిమిషాల్లో ఆటో లేదా రూ.50 పొందండి అనే ప్రకటనలు విడుదల చేసింది. ఇవి వినియోగదారులకు హామీ ఇవ్వబడిన సేవలు అందిస్తామనే భావన కలిగించాయి. కానీ వాస్తవానికి, వాగ్దానం చేసిన రూ.50ని నగదు రూపంలో కాకుండా రాపిడో నాణేలుగా ఇచ్చారు. ఆ నాణేలను కేవలం బైక్ రైడ్‌లకు మాత్రమే ఉపయోగించవచ్చు. పైగా అవి ఏడు రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఈ నిబంధనలు వినియోగదారులను తిరిగి రాపిడో సేవలు వాడేలా బలవంతం చేశాయని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ గుర్తించింది. దీనిపై భారీ స్థాయిలో ఫిర్యాదులు వెలువెత్తాయి. జూన్ 2024 నుంచి జూలై 2025 వరకు, రాపిడోపై 1,200 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి.ఈ ఫిర్యాదుల్లో అధికంగా ఏమున్నాయంటే.. అధిక ఛార్జీలు వసూలు చేయడం, రీఫండ్‌లలో జాప్యం, డ్రైవర్‌ల దురుసు ప్రవర్తన, వాగ్దానం చేసిన క్యాష్‌బ్యాక్ ఇవ్వకపోవడం వంటివి ఉన్నాయి. పైగా ఈ ఫిర్యాదులలో దాదాపు సగం పరిష్కారం కాలేదు. ఇది రాపిడో వినియోగదారుల హక్కులను నిర్లక్ష్యం చేస్తోందని స్పష్టం చేసింది.రాపిడో లెక్కచేసి వినియోగదారులను తప్పుదారి పట్టించిందని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ పేర్కొంది. ప్రకటనల్లో నిజమైన షరతులను దాచిపెట్టి, సేవల విశ్వసనీయతను హైలెట్ చేసిందని చెప్పుకొచ్చింది. ప్రత్యేకంగా, ఈ ప్రకటనలు 548 రోజులు పాటు 120 నగరాల్లో..అనేక భాషల్లో ప్రసారం కావడం వల్ల వాటి ప్రభావం మరింత ఎక్కువైందని అథారిటీ గుర్తించింది. రాపిడోపై రూ.10 లక్షల జరిమానాతో పాటు మరికొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది. తప్పుదారి పట్టించే ప్రకటనలను తక్షణం ఉపసంహరించుకోవాలని హెచ్చరించింది. ప్రభావిత వినియోగదారులందరికీ రూ.50 నగదు రూపంలో తిరిగి చెల్లించాలని కోరింది. అలాగే 15 రోజుల్లోగా సమ్మతి నివేదిక సమర్పించాలని తెలిపింది.
రాపిడోకు రూ.10 లక్షలు జరిమానా విధించిన సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ
August 21, 2025
0
Tags