దేశీయ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీ 'కాయిన్‌డీసీఎక్స్' బౌంటీ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. సైబర్ దాడిలో సుమారు 44.2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.378 కోట్లు) పోగొట్టుకున్న ఆ సంస్థ రికవరీకి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సొమ్ము రికవరీలో సహకరించిన వారికి రాబట్టిన మొత్తంలో 25 శాతం వరకు రివార్డుగా ఇస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఎథికల్ హ్యాకర్స్, వైట్-హ్యాట్ రీసెర్చర్లు, ఇతర భాగస్వాములకు సోమవారం పిలుపునిచ్చింది. అంతేకాదు సైబర్ క్రైమ్‌పై వెబ్3 కమ్యూనిటీ పోరాడాలని సూచించింది. కాయిన్‌డీసీఎక్స్‌లో ఈనెల 19న ఉదయం 4 గంటలకు సైబర్ దాడి చోటుచేసుకుంది. భాగస్వామి ఎక్స్ఛేంజీలోని తమ ఖాతాల్లోని ఒకదాంట్లో ధ్రువీకరణ లేని చొరబాటు జరిగిందని కాయిన్‌డీసీఎక్స్ భద్రతా వ్యవస్థలు గుర్తించాయి. ఈ ఘటనలో దాదాపు రూ.378 కోట్ల నష్టం వాటిల్లింది. వినియోగదారుల నిధులు భద్రంగా ఉన్నాయని, వీటిపై ఎటువంటి ప్రభావం పడలేదని సంస్థ సహవ్యవస్థాపకులు సుమిత్ గుప్తా, నీరజ్ ఖండేల్‌వాల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రకటించారు. సైబర్ దాడి వల్ల నష్టపోయిన మొత్తాన్ని కాయిన్‌డీసీఎక్స్ భరిస్తుందని, అంతర్గత నిల్వలను ఇందుకు వినియోగిస్తుందని కంపెనీ తెలిపింది. గతేడాది క్రిప్టో ఎక్స్ఛేంజీ వజీర్‌ఎక్స్‌లో కూడా 230 మి.డాలర్ల సైబర్ చోరీ జరిగిన విషయం తెలిసిందే.
బౌంటీ ప్రోగ్రామ్‌ను ప్రకటించిన కాయిన్‌డీసీఎక్స్ !
July 21, 2025
0
Tags