హైదరాబాద్ మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని శాలివాహన నగర్‌లోని పార్క్ వద్ద సీపీఐ నాయకుడు చందు రాథోడ్‌పై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. ఈరోజు ఉదయం చందు రాథోడ్ వాకింగ్ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రత్యర్థులు కాపు కాచి హత్య చేశారు. స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న ఆయనను అడ్డగించిన ప్రత్యర్థులు ముందుగా అతడి కళ్లలో కారం కొట్టారు. దీంతో భయాందోళనకు గురైన చందు అక్కడి నుంచి ప్రాణాలను కాపాడుకునేందుకు పరిగెత్తాడు. అయితే చందును వెంటాడి మరీ గన్‌తో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో చందు రాథోడ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆపై అక్కడి నుంచి దుండుగలు స్విఫ్ట్ కారులో పరారయ్యారు. హత్య సమయంలో ఐదుగురు ఉన్నట్లు ప్రాథమిక అంచనా. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని చందు రాథోడ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత కక్షలే హత్యకు కారణాలుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నాగరకర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన చందు రాథోడ్ కుటుంబంతో చైతన్యపూరిలో నివాసం ఉంటున్నారు. మృతుడు గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటన స్థలంలో ఏడు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు గన్‌లతో ఫైరింగ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ ఘటన స్థలానికి చేరుకున్నారు. పలు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చందుపై ఉన్న పాత కేసులను పరిశీలిస్తున్నారు. సీపీఐ ఎమ్మెల్యే రాజేష్‌తో చందు నాయక్ మధ్య వివాదాలు ఉన్నట్లు గుర్తించారు. నాగోల్ ప్రభుత్వ స్థలంలో కొంతమంది ప్రజలు గుడిసెలు వేసుకున్నారు. దాంతో అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులే చందుకు ప్రత్యర్థులుగా మారారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాల్పులు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వాకింగ్ చేస్తున్న సీపీఐ నాయకుడు చందు రాథోడ్ కాల్చివేత
July 15, 2025
0
Tags