ఇ-పాన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ మీకు ఏదైనా మెయిల్ వచ్చిందా? అయితే జాగ్రత్త ! ఈ తరహా మెయిల్స్ సైబర్ మోసగాళ్లు మిమ్మల్ని తప్పుదోవపట్టించి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే ఇలాంటి దుష్ట పన్నాగమేనని గ్రహించండి. ఇలాంటి మెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఈ తరహా ఆర్థిక, సున్నితమైన సమాచారానికి సంబంధించి వచ్చే ఈ-మెయిల్స్, లింక్‌లు, కాల్స్, ఎస్‌ఎంఎస్‌కు స్పందించొద్దని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం 'ఎక్స్'లో సూచించింది. ఆదాయ పన్నుశాఖ ఎప్పుడూ ఈ-మెయిల్ ద్వారా మీ వ్యక్తిగత సమాచారాన్ని కోరదు. మీ పిన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లు, క్రెడిట్ కార్డులు, బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక ఖాతాలకు సంబంధించి యాక్సిస్ చేసే సమాచారాన్ని అభ్యర్థిస్తూ ఐటీశాఖ ఇ-మెయిల్ పంపదని గుర్తుంచుకోండి. ఐటీ శాఖ అధికారినని చెప్పుకొనే వ్యక్తుల నుంచి ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌కు మిమ్మల్ని మళ్లించేలా ఏదైనా మెయిల్ వస్తే.. దానికి స్పందించకండి. అలాంటి మెయిల్ ద్వారా వచ్చే అటాచ్‌మెంట్‌లను ఓపెన్ చేయొద్దు. ఎందుకంటే వాటిలో మీ కంప్యూటర్/డివైజ్‌కు హాని కలిగించే కోడ్ ఉండొచ్చు. తద్వారా మీ డివైజ్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఎక్కువ. ఏవైనా లింక్‌లు వచ్చినా క్లిక్ చేయొద్దు. మీరు అనుమానాస్పద ఇ-మెయిల్/ఫిషింగ్ వెబ్‌సైట్‌లోని లింక్‌లపై క్లిక్ చేస్తే, బ్యాంక్ ఖాతాలు, క్రెడిట్ కార్డుల వివరాలు వంటి గోప్యమైన సమాచారాన్ని ఎంటర్ చేయకండి. మీకు వచ్చే మెసేజ్‌లో లింక్‌ను బ్రౌజర్‌లో కట్ చేసి పేస్ట్ చేయొద్దు. మీ కంప్యూటర్‌లలో యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ వాడండి. ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకొనేలా జాగ్రత్త వహించండి. మీకు ఏదైనా ఈ తరహాలో ఇ-మెయిల్ వచ్చినా లేదా ఐటీ శాఖ వెబ్‌సైట్‌గా చెప్పుకొనే అనుమానాస్పదంగా మీకు అనిపిస్తే వెంటనే వాటిని webmanager@incometax.gov.in, incident@cert-in.org.inకు ఫిర్యాదు చేయొచ్చు.
ఇ-పాన్ కార్డు డౌన్‌లోడ్ మెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం విజ్ఞప్తి
July 06, 2025
0
Tags