ఓటీటీల్లో అశ్లీల చిత్రాల యాప్‌లను నిషేధించిన కేంద్రం

Telugu Lo Computer
0


టీటీ వేదికల్లో అశ్లీల చిత్రాలను ప్రసారం చేస్తోన్న కొన్ని మాధ్యమాలపై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఉల్లు, ఏఎల్‌టీటీ సహా కొన్ని యాప్‌లు, వెబ్‌సైట్లపై నిషేధం విధించింది. ఈమేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ దీనిపై తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 24 యాప్‌లు, వెబ్‌సైట్లపై కేంద్రం ఈ నిషేధం విధించింది. ఆయా వెబ్‌సైట్లను కన్పించకుండా చేయాలని దేశంలోని అన్ని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. వీటిని ఉల్లంఘిస్తే చట్టపరమైన రక్షణను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ''ఉల్లు, ఏఎల్‌టీటీ, బిగ్ షాట్స్‌, దేశీఫ్లిక్స్‌, గులాబ్‌ యాప్‌ వంటివి పలుమార్లు నిబంధనలను ఉల్లంఘించి తమ మాధ్యమాల్లో అశ్లీల కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నాయని గుర్తించాం. అందుకే వాటిపై కఠిన చర్యలు తీసుకున్నాం'' అని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తమ ప్రకటనలో వెల్లడించింది. ఓటీటీ ప్రసార యాప్‌లు, వాటి సర్వీస్‌ ప్రొవైడర్లు తాము ప్రసారం చేసే కంటెంట్‌పై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్రం ఈసందర్భంగా గుర్తుచేసింది. భారతీయ చట్టాలను ఉల్లంఘించే కంటెంట్‌ను ప్రసారం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఉల్లు, ఏఎల్‌టీటీ, దేశీఫ్లిక్స్‌, బిగ్‌ షాట్స్‌, బూమెక్స్‌, నవరస లైట్‌, గులాబ్‌ యాప్‌, కంగన్‌ యాప్‌, బుల్‌ యాప్‌, జల్వా యాప్‌, వావ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, లుక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, హిట్‌ప్రైమ్‌, ఫినియో, షోఎక్స్‌, సోల్‌ టాకీస్‌, అడ్డా టీవీ, హాట్‌ఎక్స్‌ వీఐపీ, హల్‌చల్‌ యాప్‌, మూడ్‌ఎక్స్‌, నియాన్‌ఎక్స్‌ వీఐపీ, ఫ్యుగి, మోజ్‌ఫిక్స్‌, ట్రైఫ్లిక్స్‌లను కేంద్రం నిషేధించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)