కోర్టు ధిక్కరణ కేసులో షేక్‌ హసీనాకు ఆరు నెలల జైలు శిక్ష !

Telugu Lo Computer
0


కోర్టు ధిక్కరణ కేసులో బంగ్లా న్యాయస్థానం మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆరు నెలల జైలు విధించింది. గత ఏడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చోటుచేసుకున్న ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పదవి కోల్పోయి, దేశం వీడిన షేక్‌ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే గత ఏడాది అక్టోబర్‌లో షేక్ హసీనా రాజకీయ నాయకుడు షకీల్ అకాండ్ బుల్బుల్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లీక్ అయ్యింది. అందులో న్యాయవ్యవస్థను బెదిరించేలా ఉన్న వ్యాఖ్యలపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. ఈ వ్యాఖ్యలకుగానూ హసీనాకు ఆరు నెలలు, షకీల్ బుల్బుల్‌కు 2 నెలల జైలు శిక్ష విధిస్తూ జస్టిస్ ఎం.డి. గోలం మోర్టుజా మొజుందర్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం తీర్పు ప్రకటించింది. ఇదిలా ఉంటే ఆమెతో పాటు అప్పటి నేతలు, సలహాదారులు, సైనికాధికారులపై నేరారోపణలు నమోదయ్యాయి. ఢాకా కేంద్రంగా ఉన్న ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ ఇప్పటికే ఆమెకు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. ఆమెను స్వదేశానికి రప్పించేందుకు యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)