రాజ్యసభలో జరుగుతున్న 'ఆపరేషన్ సిందూర్'పై చర్చలో భాగంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా ప్రసంగిస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనలో బాంబు పేలుళ్లు జరగని నగరమే లేదని దుయ్యబట్టారు. వారి హయాంలో ఉగ్రవాదాన్ని చూసీ చూడనట్లుగా వదిలేశారని మండిపడ్డారు. ''పహల్గాం దాడి, అనంతరం చర్యలపై ఇప్పుడు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న వారు గతంలో వారి పాలనను గుర్తుచేసుకోవాలి. వారి హయాంలో ఢిల్లీ, వారణాసి, ముంబయి ఇలా ఎన్నో చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. అప్పట్లో పేలుళ్లు జరగని నగరమనేదే లేకుండా పోయింది. వందలాడి మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ.. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పాకిస్థాన్‌పై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. మనపై బుల్లెట్లు పేల్చిన వారికి కాంగ్రెస్ బిర్యానీ పెట్టింది. ఉగ్రదాడులు చేస్తున్న వారితో వాణిజ్య బంధాలు పెంచుకుంది'' అని జేపీ నడ్డా మండిపడ్డారు. పాక్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం అమలు నిలిపివేతను కూడా కాంగ్రెస్ అర్థం చేసుకోలేకపోయిందన్నారు. దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో మోదీ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోందని నడ్డా ఈ సందర్భంగా తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రదాడుల ఘటనలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ''ఉరిలో ఉగ్రదాడి తర్వాత ప్రధాని మాట్లాడుతూ.. బాధ్యులకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. మూడు రోజుల తర్వాత మెరుపుదాడులు చేపట్టి ఉగ్ర లాంఛ్ ప్యాడ్లను భారత్ ధ్వంసం చేసింది. ఉగ్రవాదం విషయంలో భారత వైఖరి మారిందని చెప్పేందుకు ఆ ఘటనే ఉదాహరణ. మన ప్రతిస్పందన ఎలా ఉంటుందో శత్రువులకు ఈపాటికే అర్థమై ఉంటుంది'' అని నడ్డా పేర్కొన్నారు.
యూపీఏ పాలనలో బుల్లెట్ పేల్చిన వారికి బిర్యానీ పెట్టారు !
July 30, 2025
0
Tags