భాజపా నేతలు వ్యవసాయ రంగంపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రానికి 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం సరఫరా చేసిందన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. ఒక రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. రామచంద్రరావుకు, భాజపాకి తెలంగాణ రైతాంగం పట్ల ఉన్న నిబద్ధతను ఏంటో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. రైతుల విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావివ్వకూడదని ఎన్నిసార్లు తాను విన్నవించినా రామచంద్రరావు వైఖరి మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కి సంబంధించి రాష్ట్ర రైతాంగం యూరియా కోసం క్షేత్రస్థాయిలో తిప్పలు పడుతుంటే చేయని గొప్పలు చేసినట్లుగా చెప్పుకొంటున్నారని, అది వారి అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ మొత్తానికి కేవలం 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే కేటాయించిందని గుర్తు చేశారు. ఇది తెలియకుండా 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసిందని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. తమ రాజకీయ లబ్ధి కోసం రైతులను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని భాజపా నాయకులకు హితవు పలికారు. ఇప్పటికే ఎన్నో సార్లు క్షేత్రస్థాయి పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇతర లెక్కలతో సహా కేంద్ర రసాయన ఎరువులశాఖ మంత్రి, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి, సహాయ మంత్రికి లేఖలు రాశామని.. తాజాగా రామచంద్రరావుకు కూడా లేఖ రాసినట్లు తుమ్మల పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంపై కనీస అవగాహన లేకుండా భాజపా నేతలు మాట్లాడుతున్నారు
July 30, 2025
0
Tags