ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా భారత్ ?

Telugu Lo Computer
0


అంతర్జాతీయంగా పేరు గాంచిన చైనా కంపెనీ షాంఘై ఆటోమోటివ్ ఇండస్ట్రీ కార్పొరేషన్, ఎంజీ బ్రాండ్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. అయితే తాజా పరిణామాల్లో, షాంఘై ఆటోమోటివ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ భారత్‌లో పెట్టుబడులు తగ్గిస్తూ నెమ్మదిగా మార్కెట్ నుంచి వెనక్కి తగ్గుతోంది. దీని స్థానాన్ని జేఎస్ డబ్ల్యూ గ్రూప్ చేపట్టనుంది. అంతేకాదు, భారత మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని పూర్తి స్థాయిలో తయారీ, డిజైన్, టెక్నాలజీ వ్యవస్థను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో జేఎస్ డబ్ల్యూ ముందడుగు వేసింది. ఈ పరిణామాల వల్ల వచ్చే కాలంలో ఎంజీ ఇండియా వాహనాలు మరింతగా "భారతీయత"ను నిర్వచించబోతున్నాయి. హెక్టార్ వంటి సుళువైన SUV మోడల్స్‌తో పాటు, కొమెట్ EV వంటి చిన్న ఎలక్ట్రిక్ కార్లను స్థానికంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఉంది. ఒకవైపు ప్యాసింజర్ వాహనాలు, మరోవైపు కమర్షియల్ EVలపై కూడా జేఎస్ డబ్ల్యూ దృష్టి పెట్టింది. ఇది కేవలం బిజినెస్ మార్పు మాత్రమే కాదు. ఇది భారతదేశం లో ఎలక్ట్రిక్ వాహన రంగాన్ని స్వయం నిర్మిత దిశగా తీసుకువెళ్లే ఓ మైలురాయి కూడా. ఇప్పటివరకు EV తయారీకి చాలామందికి విదేశీ బ్రాండ్లపై ఆధారపడాల్సి వచ్చింది. కానీ జేఎస్ డబ్ల్యూ ప్రణాళికలు, భారత్‌లోనే డిజైన్ చేసి తయారు చేసే వాహనాలను అందుబాటులోకి తీసుకురావడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. షాంఘై ఆటోమోటివ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ భారత మార్కెట్ నుంచి పూర్తిగా వెళ్లిపోకుండా, టెక్నాలజీ పరంగా సహకారం అందిస్తారు. బ్రాండ్ పేరు మాత్రం అదే తరహాలో కొనసాగుతుంది కానీ వ్యవస్థలో నియంత్రణ మాత్రం భారత కంపెనీలవైపే ఉంటుంది. ఇది "మేక్ ఇన్ ఇండియా" లక్ష్యానికి బాగా అనుగుణంగా ఉంటుంది. వాటా పెంపు ద్వారా జేఎస్ డబ్ల్యూ గ్రూప్, ఎవర్ స్టోన్ అనే ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ దగ్గర ఉన్న 8% వాటాను కొనుగోలు చేసే ప్రయత్నంలో ఉంది. దీనితో కలిసి జేఎస్ డబ్ల్యూ వాటా 43%కి చేరే అవకాశం ఉంది. తర్వాతి దశలో అదే మెజారిటీ వాటాగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జేఎస్ డబ్ల్యూ గ్రూప్ ఇప్పటికే కొన్ని చైనా కంపెనీలతో టెక్నాలజీ లైసెన్సింగ్ ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. ఇది ప్యాసింజర్ కార్లు మాత్రమే కాదు ట్రక్కులు, బస్సులు వంటి కమర్షియల్ వాహనాల రంగాన్ని కూడా ఆక్రమించే దిశగా ఉంది. 2026లో మొదటి కమర్షియల్ EV విడుదల చేయడం, 2027లో ప్యాసింజర్ EVను దేశీయంగా ప్రారంభించడం వంటి ప్రణాళికలు ఉన్నాయి. జేఎస్ డబ్ల్యూ గ్రూప్ ఇటీవల చైనా ఆటోమొబైల్ కంపెనీలతో రెండు వేర్వేరు లైసెన్సింగ్ ఒప్పందాలు చేసుకుంది. ఒకటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల కోసం, మరొకటి కమర్షియల్ వాహనాల ఉత్పత్తికి సంబంధించినది. ఈ ఒప్పందాల్లో ఎటువంటి ఈక్విటీ భాగస్వామ్యం లేదు. పూర్తి స్థాయిలో టెక్నాలజీ లైసెన్సింగ్ ఆధారంగా, వాహనాల తయారీ పూర్తి స్థాయిలో భారత్‌లోనే జరగనుంది. అయితే, ఇందులో భాగంగా ఉన్న చైనా కంపెనీల పేర్లను JSW గ్రూప్ ఇంకా వెల్లడించలేదు. లైసెన్సింగ్ ఒప్పందం ప్రకారం, ప్రతి వాహనానికి రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ప్యాసింజర్ ఈవీ వాహనాలను జేఎస్ డబ్ల్యూ బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి తేవనుండగా, కమర్షియల్ వాహనాలు పూర్తిగా కొత్త బ్రాండ్ పేరిట విక్రయించనున్నారు. ఈ కమర్షియల్ వాహనాల తయారీ కోసం ప్రత్యేకంగా ఒక యూనిట్‌ను నిర్మిస్తున్నారు. ఈ వ్యూహం ద్వారా జేఎస్ డబ్ల్యూ భారత్‌లో ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన ఉనికిని మరింత బలపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)