గుజరాత్‌లో దాదాపు నాలుగు దశాబ్దాల క్రితంనాటి పాత వంతెన కుప్పకూలిన ఘటనలో 13 మంది వాహనదారులు జలసమాధి అయ్యారు. నదీ ప్రవాహంలో పడి ప్రయాణికులతోసహా ట్రక్కులు, వ్యాన్‌లు, ఆటో, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టారు. మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు వడోదర జిల్లాలోని మహీసాగర్ నదిపై నిర్మించిన గంభీర వంతెన కూలడంతో ఈ ఘోరం జరిగింది. పద్రా పట్టణ సమీపంలో నిర్మించి ఈ వంతెన కూలడంతో వడోదర, ఆనంద్ నగరాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపో యాయి. నదీ ప్రవాహంలో నిర్మించిన రెండు పిల్లర్ల మధ్యలోని శ్లాబులు పూర్తిగా కుప్పకూలడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని వడోదర రూరల్ ఎస్పీ రోహన్ ఆనంద్ చెప్పారు. నదిలో పడగా నే కొందరిని స్థానికులు కాపాడారు. రక్షించిన వారిలో గాయాలపాలైన వారిని ఆస్పత్రులకు తరలించారు. బ్రిడ్జ్ కూలడంతో ఒక ట్యాంకర్ కొనకు వేలాడుతూ ప్రమాదకరంగా మారింది. దీంతో 4 గంటలపాటు శ్రమించి వెనక్కిలాగారు. కానీ అందులోని డ్రైవర్ ఆచూకీ గల్లంతైంది. బ్రిడ్జి కూలినప్పుడు కొన్ని వాహనాలు నది ప్రవాహం మధ్యలో పడి కొట్టుకుపోతే మరికొన్ని ఒడ్డు వైపున పడిపోయాయి. అప్పుడు ఒక ప్రయాణికుడు కారుతోసహా నదినీటిలో చిక్కుకు పోయాడు. అతని తల్లి మాత్రం క్షేమంగా బయటపడింది. నడుం లోతు ఉన్న నీటిలో నిలబడి ఒడ్డు వైపున్న స్థానికులను తల్లి ఏడుస్తూ వేడుకుంటున్న వీడియో చూపరులను కంటతడి పెట్టించింది. ''నా బిడ్డ ఇందులో ఇరుక్కుపోయాడు.నది నీటిలో మునిగిపోయి విలవిల్లాడిపోతున్నాడు. కాపాడండయ్యా'' అంటూ ఆమె దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. స్థానికుల సమాచారం ప్రకారం ఆ మహిళ తన భర్త, కుమారుడు, కుమార్తె, అల్లుడితో కలిసి కారులో బాగ్దానాకు వెళ్తోంది. కారు నీటిలో పడినప్పుడు వెనకవైపు అద్దం పగలగొట్టి బయ టపడింది. కుమారుడు మాత్రం నదిలో మునిగిన వాహనంలో ఇరుక్కుపోయాడు. దుర్ఘటన వార్త తెల్సి మోడీ, రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రధాని సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగా త్రులకు తలో రూ.50వేల సాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తలో రూ.4 లక్షలు ఇస్తామని సీఎం చెప్పారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ వంతెన కూలడంతో ఇలాంటి పాత వంతెన పటిష్టతపై సమీక్ష జరపాలని రాష్ట్ర అధికారులకు ప్రధాని సూచించారు.
కుప్పకూలిన వడోదర - ఆనంద్ వంతెన : 13 మంది సజీవ సమాధి
July 10, 2025
0
Tags