ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో చేసిన ప్రసంగంపై ప్రధాని మోడీ స్పందించారు. ఉగ్రవాదులను ఏరివేయడంలో ఆపరేషన్ మహాదేవ్, ఆపరేషన్ సిందూర్ ఆపరేషన్లు కీలక పాత్ర పోషించాయని స్పష్టం చేశారు. వీటి గురించి హోంమంత్రి సుదీర్ఘ వివరణ ఇచ్చారని అన్నారు. దేశ భద్రతపై భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆయన తన ప్రసంగంలో సవివరంగా చెప్పారంటూ ట్వీట్ చేశారు. అంతకుముందు ఇదే అంశంపై లోక్‌సభలో అమిత్ షా ప్రసంగిస్తూ ప్రతిపక్షాల తీరుపై ధ్వజమెత్తారు. అసలు దేశం అభివృద్ధి చెందకపోవడానికి, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ఉనికికి నెహ్రూనే కారణమని ఆరోపించారు. 1948లో భారత సైనిక దళాలు పీవోకేను చేజిక్కించుకునే స్థానంలో ఉన్నప్పటికీ అప్పటి ప్రధాని ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించడం వల్ల ఆ అవకాశం చేజారిపోయిందన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ కూడా నెహ్రూ చర్యలను వ్యతిరేకించారని గుర్తు చేశారు. తూర్పు పాకిస్థాన్ విమోచన యుద్ధం సమయంలోనూ పీఓకేను దక్కించుకునే అవకాశం వచ్చినప్పటికీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని చేజార్చుకుందని అమిత్ షా పేర్కొన్నారు. అంతేకాకుండా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత స్థానాన్ని పొందకపోవడానికి కూడా నెహ్రూనే కారణమన్నారు. ఆయన నిర్ణయాల వల్లే మనకు ఇంకా స్థానం దక్కలేదని దుయ్యబట్టారు. యూఎన్‌ఎస్‌సీలో శాశ్వత సభ్యత్వం కోసం మోదీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. దేశంపై ఉగ్రవాదులు కుట్రలకు పాల్పడుతుంటే చూస్తూ కూర్చోవడానికి ప్రస్తుతం ఉన్నది మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కాదని మోడీ ప్రభుత్వమంటూ అమిత్ షా ఉద్ఘాటించారు.
ఉగ్రవాదుల ఏరివేతలో 'సిందూర్, మహాదేవ్'లది కీలక పాత్ర !
July 29, 2025
0
Tags