కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో బాధిత కుటుంబంతో మాట్లాడేందుకు తాము యెమెన్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నిమిష తరఫున బృందం సుప్రీంకోర్టును కోరింది. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ అందుకోసం కేంద్ర ప్రభుత్వం వద్దకే వెళ్లాలని సూచించింది. నిమిష ప్రియ కేసుపై తాజాగా అత్యున్నత న్యాయస్థానం మరోసారి విచారణ జరిపింది. ఈసందర్భంగా ఆమెకు మరణశిక్ష అమలును యెమెన్ తాత్కాలికంగా నిలిపివేసిన విషయాన్ని కేంద్రం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. ఈ కేసులో తమవైపు నుంచి చర్యలు కొనసాగుతున్నాయని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి కోర్టుకు తెలిపారు. ఆమె క్షేమంగా స్వదేశానికి తిరిగిరావాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందనపై ధర్మాసనం సంతృప్తి వ్యక్తంచేసింది. నిమిష ప్రియ కేసులో కేంద్రం సాధ్యమైన ప్రయత్నాలు చేస్తోందని తెలిపింది. విచారణ సందర్భంగా నిమిష ప్రియ తరఫున న్యాయవాదుల బృందం కోర్టుకు ఓ అభ్యర్థన చేసింది. ఈ కేసులో బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరిపేందుకు వీలుగా యెమెన్ వెళ్లేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరింది. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ప్రస్తుతం ఆ దేశానికి వెళ్లకుండా ప్రయాణ ఆంక్షలు ఉన్నందున దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. ఇందుకోసం ప్రభుత్వం వద్ద అభ్యర్థన చేసుకునేలా పిటిషనర్లకు అనుమతి కల్పించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 14వ తేదీకి వాయిదా వేసింది. యెమెన్ దేశస్థుడి హత్య కేసులో నిమిష ప్రియకు జులై 16న మరణశిక్ష అమలుచేయాల్సిఉండగా.. చివరి నిమిషంలో అక్కడి ప్రభుత్వం దీన్ని వాయిదా వేసింది. బ్లడ్ మనీపై బాధిత కుటుంబంతో చర్చలు జరిపేందుకు మరింత సమయం ఇవ్వాలని భారత ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు ఆ దేశం సానుకూలంగా స్పందించింది. అయితే, ఈ బ్లడ్ మనీకి తాము ఎన్నటికీ అంగీకరించబోమని బాధిత కుటుంబం చెబుతోంది. దీంతో ఈ కేసు ఎలా ముగుస్తుందోన్న ఉత్కంఠ నెలకొంది.
బాధిత కుటుంబంతో మాట్లాడేందుకు యెమెన్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలి : అది కేంద్రాన్నే అడగండన్న సుప్రీంకోర్టు
July 18, 2025
0
Tags