ఢిల్లీ, బెంగళూరు స్కూళ్లలో బాంబు బెదిరింపులు

Telugu Lo Computer
0


ఢిల్లీ, బెంగళూరులో డజన్ల కొద్దీ స్కూళ్లకు నేడు బాంబు బెదిరింపులు వచ్చాయి. నేటి ఉదయం ఢిల్లీలోని 20 పాఠశాలలకు హెచ్చరికలు అందాయి. తొలుత రోహిణి సెక్టార్‌-3లోని అభినవ్‌ పబ్లిక్‌ స్కూల్‌ వీటిని గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత పశ్చిమ్‌ విహార్‌లోని రిచ్‌మాండ్‌ గ్లోబల్‌ స్కూల్‌కు బెదిరింపులు అందాయి. దీనికి గత మూడు రోజుల్లో రెండుసార్లు ఇలాంటి హెచ్చరికలు వచ్చినట్లు ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులకు కూడా ఓ బెదిరింపు లేఖ వచ్చింది. ''హలో.. నేను పలు స్కూళ్లలో బాంబులను అమర్చాను. వాటిని బయటకు కనిపించనీయకుండా జాగ్రత్తలు తీసుకొన్నా. ఒక్కర్ని కూడా వదిలిపెట్టను.. అందరినీ హతమారుస్తా. టీవీలో ఆ వార్తలు చూసినప్పుడు మనస్ఫూర్తిగా నవ్వుకొంటాను. ఆ తర్వాత నా చేయి, గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకొంటాను'' అంటూ పేర్కొన్నాడు. వారం రోజుల వ్యవధిలో ఢిల్లీ స్కూళ్లకు ఇలాంటి హెచ్చరికలు రావడం ఇది నాలుగోసారి. బెంగళూరు నగరంలో కూడా శుక్రవారం ఉదయం పలు పాఠశాలల్లో బాంబులు ఉన్నట్లు ఈమెయిల్స్‌ వచ్చాయి. దీంతో ఆయా ప్రాంతాలకు బాంబు డిస్పోజబుల్‌ స్క్వాడ్‌ బృందాలను పంపించారు. వీటిల్లో చాలా వరకు రాజేశ్వరీ నగర్‌, కెంగెరీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇప్పటివరకు గాలింపు బృందాలకు ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదు. ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన కొన్ని గంటల్లోనే ఇక్కడ కూడా అటువంటివే రావడం గమనార్హం. ఇవన్నీ ఒకే ఐడీ నుంచి వచ్చాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)