రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో నింబా కే బాస్ గ్రామానికి చెందిన మోనా బుగాలియా, 2021లో సబ్ ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్షలో ఉత్తీర్ణత కాలేదు. అయితే 'మూలి దేవి' పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించింది. సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)గా ఎంపికైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నది. ఎస్‌ఐ నియామకాలకు సంబంధించిన ప్రత్యేక వాట్సాప్ గ్రూప్‌లో ఆమె చేరింది. స్పోర్ట్స్ కోటా ద్వారా ముందు బ్యాచ్‌కు చెందిన అభ్యర్థిగా పరిచయం చేసుకుని రాజస్థాన్ పోలీస్ అకాడమీలోకి ప్రవేశించింది. మోనా బుగాలియా అలియాస్ మూలి దేవి రెండేళ్లపాటు రాజస్థాన్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఎస్‌ఐగా శిక్షణ పొందింది. యూనిఫాంలో పరేడ్ గ్రౌండ్స్‌లో కనిపించడంతోపాటు రిహార్సిల్స్‌లో పాల్గొన్నది. ఐపీఎస్ అధికారులతో ఫొటోలు దిగింది. సోషల్ మీడియాలో రీల్స్ పోస్ట్ చేసింది. పోలీస్ యూనిఫాం ధరించి ఐపీఎస్, సీనియర్ పోలీస్ అధికారుల సమక్షంలో బహిరంగ వేదికపై కెరీర్ అవగాహనపై ప్రసంగాలు ఇచ్చింది. పోలీస్ అకాడమీలోని నిషేధిత ప్రాంతాల్లో కూడా స్వేచ్ఛగా తిరిగింది. అయినా ఆమె నకిలీ ట్రైనీ ఎస్‌ఐ అన్నది ఎవరూ గుర్తించలేదు. 2023లో కొంతమంది ట్రైనీ ఎస్‌ఐలు మోనా బుగాలియా గుర్తింపుపై అనుమానం వ్యక్తం చేశారు. సీనియర్ పోలీస్ అధికారులకు ఆమె గురించి సమాచారం ఇచ్చారు. దీంతో అంతర్గతంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో నకిలీ గుర్తింపుతో పోలీస్ అకాడమీలో ఎస్‌ఐగా ఆమె శిక్షణ పొందుతున్నట్లు బయటపడటంతో కేసు నమోదైంది. 2023 నుంచి పరారీలో ఉన్న మోనాను సికర్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నివసించిన అద్దె ఇంటిలో తనిఖీలు చేశారు. రూ.7 లక్షల నగదు, మూడు ప్రత్యేక పోలీసు యూనిఫామ్స్, రాజస్థాన్ పోలీస్ అకాడమీకి చెందిన పరీక్షా పత్రాలు, తప్పుడు గుర్తింపు కోసం వినియోగించిన నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మోనా బుగాలియా తండ్రి లారీ డ్రైవర్. నలుగురు అక్కాచెల్లెళ్లున్న తన కుటుంబాన్ని ఆకట్టుకునేందుకు, పోలీస్ అధికారాన్ని దుర్వినియోగం చేసేందుకు తాను ఇలా చేసినట్లు ఆమె ఒప్పుకున్నది. అయితే అత్యంత భద్రత ఉన్న రాజస్థాన్ పోలీస్ అకాడమీలో నకిలీ ట్రైనీగా రెండేళ్ల పాటు ఆమె శిక్షణ పొందినప్పటికీ గుర్తించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి
రాజస్థాన్ పోలీస్ అకాడమీలో నకిలీ ట్రైనీ ఎస్‌ఐ
July 05, 2025
0
Tags