టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కి కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ !

Telugu Lo Computer
0


టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కి కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. వేల కొద్దీ ఉద్యోగులను తొలగించాలని టీసీఎస్ యాజమాన్యం ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే సంవత్సరం కాలంలో ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించుకోవాలని టీసీఎస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. తన మొత్తం ఉద్యోగులలో 2 శాతం అంటే దాదాపు 12,000 మంది ఉద్యోగులను లేఆఫ్ కింద తొలగించనుంది. ఈ విషయాన్ని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కే కృతివాసన్ తెలిపారు. ఇందుకు గల కారణాలను వెల్లడించారు. టీసీఎస్ లేఆఫ్స్ ప్రకటించిన అనంతరం మరికొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. కొత్త ఉద్యోగాలను నిలిపివేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సీనియర్ లెవెల్ ఉద్యోగులను రిక్రూట్ చేసుకోకూడదని నిర్ణయించింది. అలాగే- వార్షిక వేతనాల పెంపు, ఇంక్రిమెంట్లకు కూడా పుల్ స్టాప్ పెట్టింది. ఉద్యోగుల తొలగింపు, కొత్త నియామకాల ఆలస్యంపై నేసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ కార్మిక మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. ఈ చర్యను అమానవీయంగా అభివర్ణించింది. ఉద్యోగుల తొలగింపు అసమంజసమని, చట్టవిరుద్ధమని విమర్శించింది. చాలా మంది మిడిల్, సీనియర్ లెవెల్ స్థాయి ఉద్యోగులు 10 నుండి 20 సంవత్సరాలుగా కంపెనీకి విధేయంగా పనిచేస్తున్నారని ఎంప్లాయిస్ సెనెట్ పేర్కొంది. వారికి కనీసం ముందుస్తు సమాచారం ఇవ్వకుండా తొలగింపు గురించి మెయిల్ పంపడం సరికాదని తెలిపింది. దీన్ని కార్మిక మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకుంది. టీసీఎస్ యాజమాన్యానికి సమన్లు ఇచ్చింది. ఆగస్టు 1వ తేదీన టీసీఎస్ యాజమాన్యాన్ని కార్మిక మంత్రిత్వ శాఖ విచారించనుంది. లేఆఫ్స్, రిక్రూట్మెంట్ నిలిపివేతపై వివరణ కోరనున్నట్లు సీఎన్బీసీ ఆవాజ్ తెలిపింది. ఎంప్లాయిస్ సెనెట్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా మాట్లాడారు. లేఆఫ్స్ కు సంబంధించిన సమాచారాన్ని సంస్థ యాజమాన్యం ప్రభుత్వానికి ముందుగా తెలియజేయాల్సి ఉంటుందని, అలా జరగలేదని అన్నారు. ఇది దేశ కార్మిక చట్టాలకు విరుద్ధమని. టీసీఎస్ చర్యల వల్ల ఇతర కంపెనీలు కూడా ఇలాగే ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)