కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై డీకే శివకుమార్ ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ నా తరఫున ఎమ్మెల్యేలు మాట్లాడాలని కోరుకోవడం లేదు. 2028లో రాష్ట్రంలో జరిగే ఎన్నికలపైనే నేతల దృష్టి ఉండాలి. నేను తొలుత పార్టీ కార్యకర్తను. అన్నింటికంటే పార్టీనే ముఖ్యం. అధిష్ఠానం ఆదేశాలు, పార్టీ మ్యానిఫెస్టో ఆధారంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లో పనిచేయాలి. పార్టీలో ఎలాంటి వర్గాలు లేవు. మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని ఒక కాంగ్రెస్ మాత్రమే ఉందని అన్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పులేదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీప్ సూర్జేవాలా కూడా వెల్లడించారు. ఈ ఊహాగానాల వెనక భాజపా కుట్ర ఉందని విమర్శించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు నిలిచిపోవాలని ఆ పార్టీ కోరుకుంటోందన్నారు. కర్ణాటక కాంగ్రెస్‌లో వినిపిస్తోన్న అసమ్మతి స్వరాల వేళ అధిష్ఠానం ఆయన్ను రాష్ట్రానికి పంపింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ నాయకత్వ మార్పు ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతా ఓకే అని సూర్జేవాలా, డీకే ప్రకటించిన తరుణంలో ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. అందులో సీనియర్ నేత బీఆర్ పాటిల్ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడటం కనిపించింది. ''సిద్ధరామయ్యకు లాటరీ తగిలింది. ఆయన్ను సోనియాగాంధీకి పరిచయం చేసింది నేను. ఆయన అదృష్టం బాగుండి సీఎం అయ్యారు. నాకు ఏ గాడ్ ఫాదర్ లేరు. నేను సూర్జేవాలను కలిశాను. చెప్పాల్సిందంతా చెప్పాను. ఏం జరుగుతుందో చూద్దాం'' అని ఫోన్ మాట్లాడారు. ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నేను తొలుత పార్టీ కార్యకర్తను, అన్నింటికంటే పార్టీనే ముఖ్యం
July 01, 2025
0
Tags