ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఆస్తిని రిజిస్టర్ చేసినప్పుడు ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఒరిజనల్ డాక్యుమెంట్ కాపీని కొనుగోలుదారుడి మొబైల్ నంబరుకు వాట్సాప్‌లో పంపించే ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలో జిల్లాలో ఈ సర్వీసు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌ను డాక్యుమెంట్ రైటర్లే సాయంత్రం వేళ తీసుకొని ఆ తరువాత తీరుబడిగా కొన్నవారికి ఇస్తున్నారు. దీని కోసం రిజిస్ట్రేషన్ సమయంలో 'నామినీ' పేరు రాయించేవారు. ఇప్పుడు వాట్సాప్ ద్వారా ఆ డాక్యుమెంట్‌ను వెంటనే పంపడానికి రిజిస్ట్రేషన్ల శాఖ కార్డ్ 2.0 సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసింది. రిజిస్ట్రేషన్ సమయంలో ఆస్తి కొనుగోలుదారుని మొబైల్ నంబరు నమోదు చేయాలని అడుగుతుంది. నమోదు చేశాక దానిని వారి దగ్గరున్న ఆధార్ బేస్డ్ సమాచారంతో నిర్ధారించుకుంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి, డాక్యుమెంట్ డిజిటల్ స్కానింగ్ జరిగిన తరువాత సిస్టమ్ నుంచి ఆటోమేటిక్‌గా నమోదుచేసిన మొబైల్ నంబరుకు డాక్యుమెంట్ కాపీ వాట్సాప్‌లో వెళ్లిపోతుంది. మొబైల్‌లోనే ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఆ తరువాత సదరు వ్యక్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి బయోమెట్రిక్ వేసి ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకోవలసి ఉంటుంది. ఇంతకుముందులా వాటిని డాక్యుమెంట్ రైటర్లకు గానీ వేరొకరికి గానీ ఇవ్వరు. రిజిస్ట్రేషన్ల శాఖ వ్యవహారాల్లో పారదర్శకత పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనివల్ల ఎవరి డాక్యుమెంట్ వారికే అందుతుంది. వేరొకరు చూసే అవకాశం కూడా ఉండదు. అయితే రిజిస్ట్రేషన్ సమయంలో సరైన మొబైల్ నంబరు ఇవ్వాల్సి ఉంటుంది.
వాట్సాప్‌లోనే రిజిస్టర్డ్ డాక్యుమెంట్
July 28, 2025
0
Tags