ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు తాను కూడా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములు అవుతారని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో జీరో పావర్టీ-పీ4పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు వివిధ అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. ''పీ4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోంది. పేద కుటుంబాల సాధికారతే కూటమి ప్రభుత్వం లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారందరినీ ఈ కార్యక్రమంలో మమేకం చేయాలి. కార్పొరేట్ సంస్థలు కలిసి వచ్చేలా చూడటంతో పాటు సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లాల కలెక్టర్లదే. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ఆ ప్రాంతానికే చెందిన ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రామికవేత్తలు స్థానిక బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలి. బంగారు కుటుంబాల అత్యంత ప్రాధాన్యతలపై చేపట్టిన సర్వేను ఆగస్టు 10లోపు పూర్తిచేయాలి. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను 'మార్గదర్శులు' దత్తత తీసుకునేలా చూడాలి'' అని సీఎం ఆదేశించారు. ఇప్పటి వరకు 5,74,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోగా, 57,503 మంది మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం లక్ష్యం నెరవేరాలంటే మరో 2 లక్షల మంది మార్గదర్శుల అవసరం ఉందని తెలిపారు. పల్నాడు జిల్లా నుంచి అత్యధికంగా బంగారు కుటుంబాల దత్తత జరిగిందని, విశాఖపట్నం జిల్లా చివరలో ఉందన్నారు. దత్తత తీసుకున్న కుటుంబాలకు ఆటోమేటెడ్ మెసేజ్ రూపంలో సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తున్నామన్నారు. సోషల్ మీడియా, ఇతర ప్లాట్ ఫామ్‌ల ద్వారా పీ4 కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తలపెట్టిన డిజిటల్ ప్రమోషన్ కార్యకలాపాల గురించి సీఎంకు అధికారులు వివరించారు.
పేద కుటుంబాల సాధికారతే కూటమి ప్రభుత్వం లక్ష్యం : సీఎం చంద్రబాబు
July 25, 2025
0
Tags