తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉండే నివాసానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసు అధికారులు అది తప్పుడు బెదిరింపు అని తేల్చారు. అయితే ఈ బాంబు దాడి తాలూకా బెదిరింపు ఎవరి పని అనే విషయంపై ఇప్పుడు అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈరోజు ఉదయం చెన్నైలోని పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేశాడు. చెన్నైలోని అళ్వార్ పేటలోని సీఎం స్టాలిన్ ఇంట్లో బాంబు పెట్టినట్లు బెదిరించారు. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యి.. చెన్నై నగర పోలీసులు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్ బృందాలతో సీఎం నివాసాన్ని జల్లెడ పట్టారు. సుమారు గంటన్నర పాటు ఇంటి బయట, లోపల విస్తృతంగా తనిఖీ చేసిన తర్వాత అది తప్పుడు బెదిరింపుగా అధికారులు తేల్చారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని తేల్చుకున్నాకే నఖిలీ బెదిరింపు కాల్ అని పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ తప్పుడు బెదిరింపుల వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్ చేసిన ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడ్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
హీరో విజయ్ ఇంటికి కూడా బెదిరింపులు
తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, ప్రముఖ హీరో విజయ్ ఇంట్లో కూడా ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ రెండు నకిలీ బెదిరింపులే అని తేల్చిన పోలీసులు వీటి రెండింటికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.