ఇంటెల్‌ కృత్రిమ మేధ రేసులో చాలా వెనుకబడింది : సీఈవో లిప్‌-బు టాన్‌

Telugu Lo Computer
0


ఇంటెల్‌ కృత్రిమ మేధ రేసులో చాలా వెనుకబడిందని ఆ సంస్థ కొత్త సీఈవో లిప్‌-బు టాన్‌ అంగీకరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల వీడియోలైవ్‌ టెలికాస్ట్‌లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఈ పరిస్థితి నుంచి పుంజుకోవడానికి తీవ్రంగా కృషి చేయాల్సి ఉంటుందన్నారు. ఆయన గత సీఈవో పాట్‌ గెల్షింగర్‌ నుంచి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉద్యోగులతో మాట్లాడారు. ''30 ఏళ్ల క్రితం మనమే నిజమైన లీడర్లం. కానీ, ఇప్పుడు ప్రపంచం మొత్తం మారిపోయింది. సెమీ కండెక్టర్‌ కంపెనీల్లో మనం కనీసం టాప్‌-10లో కూడా లేం'' అని స్పష్టం చేశారు. సంప్రదాయ మార్కెట్‌ నుంచి కీలకమైన కృత్రిమ మేధ రంగంలోకి మళ్లేందుకు కంపెనీ అవస్థలు పడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని అభిప్రాయపడ్డారు. ఈ రంగంలోని ఎన్విడియా ఏఐ చిప్‌ డెవలప్‌మెంట్‌లో చాలా బలంగా ఉందని, దానిని నేరుగా సవాలు చేసే స్థితిలో ఇంటెల్‌ పరిస్థితి లేదన్నారు. ఇంటెల్‌ త్వరలో విడుదల చేయనున్న 18ఏ మోడల్‌ తమ అంతర్గత వినియోగదారుల అవసరాలను బలంగా తీరుస్తుందన్నారు. సంస్థలో సమూల మార్పు తీసుకురావడం ఓ మారథాన్‌ అని పేర్కొన్నారు. కంపెనీ ఏఎండీ, ఎన్విడియాలా మరింత దూకుడుగా ఉండాలని చెప్పారు. కస్టమర్లతో ఉద్యోగులు వినయంగా ఉండి, వారి అవసరాలకు తగినట్లు స్పందించాలన్నారు. వాస్తవానికి ఇంటెల్‌ ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లో ఉంది. సంస్థ ఒరెగాన్‌ క్యాంపస్‌ నుంచే 529 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని కోతలు ఉంటాయని సంకేతాలు ఇచ్చింది. మార్కెట్‌ విలువ కూడా బాగా తగ్గి 100 బిలియన్‌ డాలర్లకు చేరింది. దాదాపు 18 నెలల క్రితం ఇది రెట్టింపుగా ఉంది. మరోవైపు ఎన్విడియా మార్కెట్‌ విలువ నేడు 4 ట్రిలియన్‌ డాలర్లను తాకింది. ప్రపంచంలో ఈ మార్క్‌కు చేరిన తొలి కంపెనీగా నిలిచింది. తాము టాప్‌-10లో కూడా లేమని ఇంటెల్‌ సీఈవో లిప్‌-బు టాన్‌ చేసిన కామెంట్‌పై కంపెనీ ప్రతినిధి వివరణ ఇచ్చారు. అది కేవలం మార్కెట్‌ విలువలో మాత్రమే అని.. టెక్నాలజీ సామర్థ్యాల్లో కాదని స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)