తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పాసైన ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మిడియట్ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టెన్త్ తర్వాత విద్యార్థులకు ఇంటర్ విద్య ఎంతో కీలకం. ఇంటర్ అర్హతతోనూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించవచ్చు. అలాగే ఇంటర్ చేసి ఐటీఐలో శిక్షణ పొందవచ్చు. కౌమార దశలోని యువత చెడు వ్యసనాలు, చెడు అలవాట్ల బారిన పడకుండా వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతీ ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేయాలని సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఆ విధంగా అవకాశాలు కల్పించి అమలు జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖపై ఐసీసీసీలో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. "విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ దశ కీలకమైనది. ఆ దశలో విద్యార్థికి సరైన మార్గదర్శకత్వం లభించాల్సిన అవసరం ఉంది. ఇతర రాష్ట్రాల్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉంటుంది. అందువల్ల ఆ రాష్ట్రాల్లో డ్రాపౌట్స్ సంఖ్య తక్కువగా ఉంది. ఇంటర్ వేరుగా.. 12వ తరగతి వరకు పాఠశాలలు ఉన్న రాష్ట్రాల్లో అధికారులు అధ్యయనం చేసి ఈ విధానంపై సమగ్ర నివేదిక సమర్పించాలి" అని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో విద్యా కమిషన్, ఎన్జీవోలు, పౌర సమాజం సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఇంటర్ విద్య మెరుగుకు అన్ని దశల్లో చర్చించి శాసనసభలోనూ చర్చ పెడతామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అనంతరం యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్ స్కూళ్ల నమూనాలను సీఎం పరిశీలించారు. ప్రతి పాఠశాల ముందు భారీ జాతీయ జెండా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు చేశారు. రాష్ట్రంలో పాఠశాలల నిర్మాణం ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతి వారం తనకు నివేదిక సమర్పించాలని ఈ మేరకు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అబ్బాయిలకు ఒకటి, అమ్మాయిలకు ఒకటి యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్ స్కూళ్ల నిర్మాణాలను చేపడతామని సీఎం రేవంత్ అన్నారు. ఈ మేరకు వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వ విద్యాలయం నిర్మాణ నమూనాను సీఎం రేవంత్ పరిశీలించారు. పలు మార్పులు చెప్పారు. వీలైనంత త్వరగా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
టెన్త్ పాసైన ప్రతీ విద్యార్థి ఇంటర్ చదవాల్సిందే: సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
July 02, 2025
0
Tags