బానిసత్వాన్ని అంగీకరించడానికి బదులు జైల్లో చీకటి గదిలో జీవించడానికి ఇష్టపడతా !

Telugu Lo Computer
0


పాకిస్తాన్ పార్లమెంటు చేసిన ఓ చట్ట సవరణను ఉద్దేశిస్తూ ఎక్స్‌లో స్పందించిన మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ 'ఈ బానిసత్వాన్ని అంగీకరించడానికి బదులు జైల్లో చీకటి గదిలో జీవించడానికి ఇష్టపడతానని' అన్నారు. తన సందేశాన్ని ప్రజలకు చేరకుండా ప్రభుత్వం అన్నివిధాలా అడ్డుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని తన మద్దతుదారులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ''ప్రజాస్వామ్యంలో నాలుగు అంశాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఓటుహక్కు, చట్టబద్ధ పాలన, నైతికత, స్వేచ్ఛాయుత మీడియా. ఇటీవల చేసిన ఇరవై ఆరవ రాజ్యాంగ సవరణ వీటన్నింటినీ నాశనం చేసింది. జులై 6 తర్వాత.. ఈ నిరంకుశ పాలకులకు వ్యతిరేకంగా పోరాడాలని దేశం మొత్తానికి ముఖ్యంగా పీటీఐ కార్యకర్తలకు, మద్దతుదారులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ బానిసత్వాన్ని అంగీకరించడం కంటే జైల్లో చీకటి గదిలోనే జీవిస్తా'' అని ఇమ్రాన్‌ పేర్కొన్నారు. తన సందేశాన్ని ప్రజలకు చేరకుండా ప్రభుత్వం అన్నివిధాలా అడ్డుకుంటోందన్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌ ఆసిమ్‌ మునీర్‌పైనా ఇమ్రాన్‌ ఖాన్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓ నియంత అధికారంలోకి వస్తే అతడికి ఓట్లు అవసరం లేదని, ట్రయల్‌-అండ్‌-ఎర్రర్‌ పద్ధతిలో పాలన కొనసాగిస్తాడని విమర్శించారు. అక్కడి న్యాయవ్యవస్థపైనా మాజీ ప్రధాని మాట్లాడారు. కోర్టుల్లో 'ఎంపిక చేసిన' న్యాయమూర్తులే ఉంటున్నారని.. స్వతంత్రంగా వ్యవహరించే వాళ్లు శక్తిహీనులుగా మారిపోతున్నారని అన్నారు. దేశంలో వాక్‌ స్వాతంత్ర్యం కనుమరుగవుతోందన్న ఇమ్రాన్‌, నిజాయతీ గల జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. 2023 మే 9న ఆయన అరెస్టు అనంతరం లాహోర్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపైనా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)