రెపో రేటు తగ్గినా ప్రైవేటు బ్యాంకులు ఆటోమొబైల్ రుణగ్రహీతలకు ఆ వడ్డీ ప్రయోజనాన్ని బదిలీ చేయడం లేదని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఫాడా ఆర్‌బీఐకి ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాకు ఫెడరేషన్ లేఖ రాసింది. ''ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేందుకు ఆర్‌బీఐ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మీ నేతృత్వంలో వేగంగా వడ్డీ రేట్లను తగ్గించారు. ఎకానమీకి ఇది ఎంతో మేలు చేకూర్చే అంశం. అయితే, ఆటో రిటైల్ రంగంలో ఆ ప్రయోజనం కనిపించడం లేదు. ప్రభుత్వరంగ బ్యాంకులు రెపో రేటు ప్రయోజనాన్ని ఆటోమొబైల్ రుణ గ్రహీతలకు బదిలీ చేస్తున్నా.. చాలా వరకు ప్రైవేటు బ్యాంకులు ఆ పనిచేయడం లేదు'' అంటూ ఫాడా వైస్ ప్రెసిడెంట్‌సాయి గిరిధర్ తన లేఖలో పేర్కొన్నారు. ప్రైవేటు బ్యాంకులు సత్వరమే వడ్డీ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రైవేటు బ్యాంకులపై ఆర్‌బీఐకి ఫాడా ఫిర్యాదు
July 26, 2025
0
Tags