స్కూల్ బస్ ను ఢీకొట్టిన పాసింజర్ రైలు : అయిదుగురు విద్యార్థులు దుర్మరణం

Telugu Lo Computer
0


మిళనాడులోని  కడలూర్ జిల్లాలోని సెమ్మంగుప్పం సమీపంలో కడలూర్- ఆలప్పాక్కం స్టేషన్ల మధ్య రైల్వే గేటు దాటుతున్న సమయంలో స్కూల్ బస్సును విల్లుపురం- మైలాడుథురై పాసింజర్ రైలు వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు మొత్తం తుక్కు తుక్కు అయింది. ఎగిరిపడింది. అయిదుగురు విద్యార్థులు సంఘటన స్థలంలోనే మరణించారు. మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్ ఇది. ఇది చెన్నై-తంజావూరు మెయిన్ ట్రాక్ కూడా. చెన్నై నుంచి కడలూరు మీదుగా ప్రతిరోజు సుమారు 15 రైళ్లు దీని మీదుగా నడుస్తుంటాయి. రద్దీతో కూడుకున్న లెవెల్ క్రాసింగ్. నిత్యం స్కూల్ బస్సులు సహా పలు వాహనాలు ఈ గేట్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, సరకు రవాణా వాహనాలు వందల సంఖ్యలో దీని మీదుగా తిరుగాడుతుంటాయి. రైలు వచ్చే సమయాల్లో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉంటారు. ఈ క్రమంలో ఈ ఉదయం స్కూల్ బస్సు రైల్వే గేటు వద్దకు చేరుకున్న సమయంలోనే పాసింజర్ రైలు వస్తోన్న సమాచారం అందడంతో దాన్ని మూసివేయడానికి గేట్ కీపర్ ప్రయత్నించాడు. స్కూల్ బస్ డ్రైవర్ ఆయనను బతిమాలాడు. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని, బస్ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని కోరాడు. దీంతో బస్సు పట్టాలు దాటడానికి గేట్ కీపర్ అంగీకరించాడు. పట్టాలు దాటుతున్న సమయంలో పాసింజర్ రైలు బలంగా బస్సును ఢీ కొట్టింది. బస్సును కొన్ని మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. దీని ధాటికి స్కూల్ బస్సు మొత్తం నుజ్జుగుజ్జు అయింది. రైల్వే ట్రాక్ నుండి దూరంగా పడిపోయింది. ఈ ప్రమాదంలో అయిదుగురు విద్యార్థులు మృతి చెందారు. సుమారు 10 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. బస్సును రైలు ఢీకొనడం చూసిన వెంటనే స్థానికులు, వాహనదారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో దిగారు. బస్సులో చిక్కుకున్న పిల్లలను బయటికి తీశారు. అంబులెన్స్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)