అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కొనసాగుతున్న వివాదాల మధ్య కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించాడు. ఈ ప్రకటన తర్వాత మస్క్ ఎదురు దెబ్బలను ఎదుర్కొంటున్నాడు.ఈ ప్రకటన స్టాక్ మార్కెట్లో టెస్లా కంపెనీ షేర్లపై భారీ ప్రభావాన్ని చూపింది. గత 24 గంటల్లో మస్క్ టెస్లా స్టాక్ క్రాష్ కారణంగా 15.3 బిలియన్ డాలర్లు (రూ. 1.31 లక్షల కోట్లకు పైగా) నష్టాలను చవిచూశాడు. ట్రంప్ తో వివాదం తర్వాత గత కొన్ని రోజులుగా ఎలోన్ మస్క్ నికర విలువ నిరంతరం తగ్గుతూ వస్తోంది. మస్క్ తాజా ప్రకటన ప్రకారం వచ్చే 12 నెలల్లో అమెరికా హౌస్, సెనేట్ స్థానాల పోటీ కోసం ఆయన కొత్త పార్టీ పనిచేయనుంది. తర్వాత వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి కూడా పోటీ చేయవచ్చనే క్లూని కూడా మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X' లో పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఆయన పార్టీపై ఎటువంటి అధికారిక వివరాలు ఇవ్వలేదు. ఇప్పటిదాకా అమెరికాలో ఫెడరల్ ఎలెక్షన్ కమిషన్ వద్ద ఎటువంటి అధికారిక పత్రాలు దాఖలు చేయలేదు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లోని నవీకరించబడిన డేటాను పరిశీలిస్తే మస్క్ సంపద కేవలం 24 గంటల్లో 15.3 బిలియన్ డాలర్లు తగ్గింది. దీని తర్వాత, అతని నికర విలువ 346 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ తాజా పతనంతో 2025 సంవత్సరంలో మస్క్ నష్టం 86.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ వార్తలతో టెస్లా ఇన్వెస్టర్లు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇక జపాన్, దక్షిణ కొరియాతో సహా 14 దేశాలపై డొనాల్డ్ ట్రంప్ కొత్త సుంకాలను ప్రకటించారు. దీని ప్రభావం కూడా అమెరికా స్టాక్ మార్కెట్ పతనం రూపంలో కనిపించింది.
24 గంటల్లో రూ. 1.31 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయిన ఎలాన్ మస్క్
July 08, 2025
0
Tags