జులై 30న నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ ప్రారంభం

Telugu Lo Computer
0


జులై 30న నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ ప్రారంభం కానుంది. మొత్తం రూ.4 వేల కోట్లు మార్కెట్‌ నుంచి సమీకరించనుంది. ఆగస్టు 1తో పబ్లిక్‌ ఇష్యూ ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు జులై 29నే బిడ్డింగ్‌ విండో తెరుచుకోనుంది. ధరల శ్రేణిని శుక్రవారం ఖరారు చేసింది. ఒక్కో షేరుకు రూ.760-800గా నిర్ణయించింది. అప్పర్‌ ప్రైస్‌ బ్యాండ్‌ వద్ద కంపెనీ రూ.4011 కోట్లు సమీకరించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 18 షేర్లు (లాట్‌) కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అప్పర్‌ ప్రైస్‌ బ్యాండ్‌ వద్ద రూ.14,400 పెట్టుబడి పెట్టాలి. రిటైల్‌ ఇన్వెస్టర్లు గరిష్ఠంగా 13 లాట్‌లు కొనుగోలు చేయొచ్చు. ఈ పబ్లిక్‌ ఇష్యూ పూర్తి ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో జరుగుతుంది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ ఆఫ్‌ ఇండియా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐడీబీఐ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా తమ తమ వాటాలను తగ్గించుకోనున్నాయి. మొత్తం 5.01 కోట్ల షేర్లను ఓఎఫ్‌ఎస్‌ రూపంలో విక్రయించనున్నారు. దీనివల్ల ఎన్‌ఎస్‌డీఎల్‌కు ఒక్క రూపాయి కూడా రాదు. దేశంలో అతిపెద్ద డిపాజిటరీగా ఉన్న ఎన్‌ఎస్‌డీఎల్‌ గతేడాది అక్టోబర్‌లోనే మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు పొందింది. సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ 2017లోనే ఎన్‌ఎస్‌ఈలో లిస్టయ్యింది. ఇప్పుడు లిస్టింగ్‌కు వస్తున్న రెండో సంస్థ ఇది. డిపాజిటరీ కంపెనీలో ఏ ఒక్క సంస్థా 15 శాతానికి మించి వాటాలు ఉండకూడదన్న సెబీ నిబంధనల నేపథ్యంలో ఆయా కంపెనీలు వాటాలు తగ్గించుకుంటున్నాయి. ఐడీబీఐకి 26.10 శాతం, ఎన్‌ఎస్‌ఈకి 24 శాతం చొప్పున ప్రస్తుతం వాటా ఉంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్స్‌, ఐడీబీఐ క్యాపిటల్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ సంస్థలు ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఎన్‌ఎస్‌డీఎల్‌ నికర లాభం రూ.343 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం రూ.1,535 కోట్లుగా నమోదైంది. ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న ఐపీఓ కావడంతో దీనిపై మదుపర్లలోనూ ఆసక్తి నెలకొంది. దీంతో గూగుల్ ట్రెండ్స్‌లోనూ ఎన్‌ఎస్‌డీఎల్‌ ఐపీఓ గురించి నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)