సైబర్ నేరాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ చక్ర-V పేరుతో 5 రాష్ట్రాల్లోని 42 ప్రదేశాల్లో దాడులు జరిపి తొమ్మిది మందిని అరెస్ట్ చేసింది. యూపీఐ ద్వారా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి ఈ ఆపరేషన్‌ను సీబీఐ చేపట్టింది. దాదాపు 700 బ్యాంకు శాఖల పరిధిలోని 8.5 లక్షల మ్యూల్ ఖాతాల ద్వారా ఈ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారన్న పక్కా నిఘా వర్గాల సమాచారంతో ఈ దాడులు చేపట్టినట్లు సీబీఐ తెలిపింది. ''నిర్దిష్ట సమాచారం ఆధారంగా పనిచేస్తూ ధ్రువీకరణ తర్వాత ఆపరేషన్ చక్ర-Vలో భాగంగా రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని 42 ప్రదేశాల్లో సమన్వయంతో సోదాలు ప్రారంభించాం. మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న సైబర్ ముఠా మోసాలను అడ్డుకోవడానికి ఈ ఆపరేషన్ చేపట్టాం'' అని సీబీఐ ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. మోసపూరిత ప్రకటనలు, పెట్టుబడి మోసాలు, యూపీఐ ఆధారిత ఆర్థిక మోసాల ద్వారా బాధితుల ఖాతాల నుంచి వచ్చిన అక్రమ నిధులను బదిలీ చేయడానికి, ఉపసంహరించుకోవడానికి ఈ మ్యూల్ ఖాతాలను ఉపయోగిస్తున్నట్లు సీబీఐ గుర్తించింది. ఈ దాడుల్లో మొబైల్ ఫోన్లు, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఫారాలు, కేవైసీ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో మధ్యవర్తులు, ఏజెంట్లు, అగ్రిగేటర్లు, ఖాతాదారులు, కొందరు బ్యాంక్ కరస్పాండెంట్లు ఉన్నారని సీబీఐ వెల్లడించింది. సైబర్ నేరాలతో కొందరు బ్యాంకు అధికారులు, ఏజెంట్లు కూడా కుమ్మక్కైనట్లు సీబీఐ భావిస్తోంది. నేరాలు, కుంభకోణాలు, మోసాలు, ఇతర అక్రమ మార్గాల్లో సొత్తును దోచుకున్నవారు దర్యాప్తు సంస్థలకు తమ ఉనికి చిక్కకుండా అక్రమ లావాదేవీలు, మనీ లాండరింగ్ కార్యకలాపాలు చేయడానికి అనామకుల పేరిట బ్యాంకు ఖాతాలు తెరుస్తుంటారు. అక్రమ సొత్తును అందులోకి మళ్లిస్తుంటారు. సాధారణంగా సైబర్ నేరగాళ్లు వారు కొల్లగొట్టిన సొత్తు మళ్లించేందుకు మ్యూల్ ఖాతాల్ని వినియోగిస్తుంటారు. ప్రతిగా వారికి నెలనెలా కొద్ది మొత్తం సొమ్మును ఇస్తుంటారు. ఎప్పుడైనా పోలీసులు విచారణ జరిపినా అసలు సూత్రధారులు చిక్కరు. ఇలాంటి ఖాతాల్ని మ్యూల్ ఖాతాలు అంటారు. డబ్బులు తీసుకుని నేరగాళ్లకు ఆ ఖాతాల్ని ఇచ్చేవారిని మనీ మ్యూల్స్‌గా పరిగణిస్తారు.
ఆపరేషన్ చక్ర-V పేరుతో తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన సీబీఐ
June 26, 2025
0
Tags