మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుధ్య, ఎన్‌ఎంఆర్ కార్మికులకు షరతులు లేకుండా తల్లికి వందనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేట్టాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) పిలుపు నిచ్చింది. ఈ మేరకు ఆ సంఘం విడుదల చేసిన ప్రకటనలో 15వ తేదీన జిల్లా కేంద్రాల్లో రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించాలని కోరింది. 16న కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రాలు సమర్పించాలని, 17వ తేదీన ప్రజాప్రతినిధుల వద్దకు రాయబారాలు నిర్వహించాలని, 18వ తేదీన పట్టణాల్లో ధర్నాలు, ప్రదర్శనలతో పాటు 23వ తేదీన కలెక్టరేట్ల వద్ద్ద ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. మరోవైపు తల్లికి వందనంతో పాటు అన్ని సంక్షేమ పథకాలను మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుధ్య, ఎన్‌ఎంఆర్ కార్మికులకు అమలు చేయాలని కోరుతూ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నాగభూషణం, కె.ఉమామహేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణకు లేఖ రాశారు. మున్సిపల్ కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని జిఓ ఎంఎస్ నెంబరు 36 ప్రకారం జీతాలు పెంచి చెల్లించాలని కోరారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీల్లో నివసిస్తున్న కోటిన్నర మంది ప్రజల అవసరాలు తీరుస్తూ ప్రజారోగ్యం, పర్యావరణాన్ని కాపాడటంలో సుమారు 48 వేలమంది మున్సిపల్ ఇంజనీరింగ్, పారిశుధ్య, ఎన్‌ఎంఆర్ కార్మికులు విశిష్ట సేవలు అందిస్తున్నారని తెలిపారు. కరోనా, వరదలు, తుఫాను వంటి సమయాల్లో ప్రాణాలు పణంగా పెట్టి సేవలు చేస్తున్నారని తెలిపారు. అయినా వారికి చాలీచాలని జీతాలే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు వర్తింపజేస్తే కొంత ఉపశమనం ఉంటుందని వివరించారు. పారిశుధ్య కార్మికులకు చెల్లించిన విధంగా ఇంజనీరింగ్ కార్మికులకు రూ.21 వేలు, రూ.24,500 చొప్పున చెల్లించాలని కోరారు. వారికి ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
'తల్లికి వందనం' అమలు కోసం నేటి నుండి సిఐటియు రాష్ట్ర వ్యాప్త నిరసనలు
June 15, 2025
0
Tags