దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చనుందనే సంకేతాలు ఇందుకు కారణమయ్యాయి. టెహ్రాన్‌ను ఖాళీ చేయాలని పౌరులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించడం ఇందుకు నేపథ్యం. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రాంతీయ పోరుకు దారితీయొచ్చన్న భయాలు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు కూడా పెరగడంతో సూచీలు ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 24,900 దిగువన ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 81,869.47 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 81,796.15) స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న సూచీ.. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 81,427.01 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. 212 పాయింట్ల నష్టంతో 81,583.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 93.10 పాయింట్ల నష్టంతో 24,853.40 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.24గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎటర్నల్, సన్‌ఫార్మా, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, మారుతీ సుజుకీ, టీసీఎస్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 74.28 డాలర్లవద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 3405 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
యుద్ధ భయంతో నష్టాల్లో ముగిసిన సూచీలు
June 17, 2025
0
Tags