ఇంటెల్‌లో 20% ఉద్యోగుల తొలగింపు ?

Telugu Lo Computer
0


ఇంటెల్‌లో కొత్త విడత తొలగింపులు జులై మధ్యలో ప్రారంభమై నెలాఖరు నాటికి ముగిసే అవకాశం ఉందని కంపెనీ విడుదల చేసిన అంతర్గత మెమో ప్రకారం తెలుస్తోంది. ఇంటెల్ చిప్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ చీఫ్ నాగ చంద్రశేఖరన్ తెలిపిన వివరాల ప్రకారం 'ఈ నిర్ణయం చాలా బాధాకరమైనది. కానీ పరిశ్రమ సవాళ్లను పరిష్కరించడానికి, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో అవసరం' అని చెప్పారు. ఉద్యోగుల తగ్గింపు శాతంపై ఇంటెల్ నేరుగా వ్యాఖ్యానించనప్పటికీ ఉద్యోగులను 'జాగ్రత్తగా, గౌరవంతో' చూస్తామని కంపెనీ పేర్కొంది. వినియోగదారుల అవసరాలకు మెరుగ్గా స్పందించడానికి ఇంజినీరింగ్ బృందాలను శక్తివంతం చేయడానికి విస్తృత ప్రయత్నంలో భాగంగా ఈ మార్పులు ఉన్నాయని తెలిపింది. గణనీయమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో ఇంటెల్‌ ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని ప్రకటించింది. పీసీ, డేటా సెంటర్ మార్కెట్లలో పెరుగుతున్న పోటీ వల్ల కంపెనీ కాస్త వెనుకబడుతుందనే వాదనలున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కూడా అవకాశాలను అందిపుచ్చుకోవడంలేదనే అభిప్రాయాలున్నాయి. ఇంటెల్ 2024లో 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇందులో ఒరెగాన్‌లో 3,000 మంది ఉన్నారు. రాబోయే తొలగింపులు ప్రపంచవ్యాప్తంగా ఇంటెల్ కర్మాగారాలపై ప్రభావం చూపనుండగా, సుమారు 20,000 మంది కార్మికులున్న ఒరెగాన్‌లో గట్టిదెబ్బ పడే అవకాశం ఉంది. పెట్టుబడి ప్రాధాన్యతలు, నైపుణ్య మదింపుల ఆధారంగా కోతలకు సిద్ధం కావాలని కంపెనీ ఇప్పటికే విభాగాలను నోటిఫై చేసింది. ఉన్నత యాజమాన్యం అందించిన చట్రంలోనే తొలగింపులను అమలు చేసే విచక్షణాధికారాన్ని ఆయా విభాగాధిపతులకు ఇచ్చినట్లు తెలిసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)