హైదరాబాద్ నగరంలో ఖాళీగా ఉన్న ప్లాట్లకు ట్యాక్స్ వసూలు ?

Telugu Lo Computer
0


హైదరాబాద్ నగరంలో ఖాళీగా ఉన్న ప్లాట్లకు కూడా ట్యాక్స్ వసూలు చేసేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్లాట్లలో బోర్డులు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఖాళీ ప్లాట్ల యజమానుల నుంచి పన్నులు వసూలు చేసేందుకు జీహెచ్‌ఎంసీ రెడీ అయింది. జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్ 212(2) ఖాళీ స్థలాలపై వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. భూమి ధర మార్కెట్ రేటులో 0.05 శాతంను వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ (వీఎల్‌టీ) కింద చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. వీఎల్టీ వసూలైతే జీహెచ్‌ఎంసీకి దాదాపు రూ.110 కోట్ల మేర ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా వీఎల్‌టీ చెల్లించాల్సిన ఖాళీ స్థలాల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. కాగా ఈ వసూళ్ల బాధ్యతలను డిప్యూటీ కమిషనర్లకు అప్పగించారు. ప్రతి బిల్ కలెక్టర్, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లకు రోజు వారీ టార్గెట్ విధించి వసూళ్లకు చర్యలకు తీసుకోవాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ సూచించారు. మరో వైపు ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదైన ఖాళీ ప్లాట్లలో ఆ ప్లాట్ నుంచి చెల్లించాల్సిన వీఎల్‌టీ చెల్లించలేదనే ఫ్లెక్సీ బోర్డును అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అసెస్ కానీ ఖాళీ స్థలాలను కూడా క్షేత్ర స్థాయిలో గుర్తించి వాటిని ట్యాక్స్ జాబితాలో తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. వీఎల్‌టీ వసూళ్ల ద్వారా జీహెచ్‌ఎంసీకి ఆదాయంతో పాటు ఖాళీ ప్లాట్లలో చెత్తా చెదారం, వ్యర్థాల నిల్వలు ఉండకుండా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)