కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో బీజేపీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదివారం నాడు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ లో ముస్లింల ఓటు బ్యాంకు కోసమే ఆపరేషన్ సిందూర్, వక్ఫ్ సవరణ చట్టాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా ఈ దేశంలోని తల్లులు, సోదరీమణులను అగౌరవపరుస్తున్నారని తప్పుపట్టారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర మహిళలంతా ముఖ్యమంత్రికి, టీఎంసీకి గట్టి గుణపాఠం చెప్పాలన్నారు. ఆపరేషన్ సిందూర్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ రాజకీయం చేస్తున్నాయని మమతాబెనర్జీ ఇటీవల ఆరోపించారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తును మాత్రమే కాకుండా జాతి భద్రతను నిర్ణయించే ఎన్నికలని అన్నారు. బంగ్లాదేశీయుల కోసం దేశ సరిహద్దులను మమతా బెనర్జీ తెరిచిపెట్టారని ఆరోపించారు. చొరబాటుదారులను రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారని, వారిని అడ్డుకోవడం ఆమె వల్లకాదని, ఒక్క బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఆపని చేయగలదని చెప్పారు. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ ఆపరేషన్ కోసం, కంచె కోసం భూమి కేటాయించమని అడిగినా ఆమె కేటాయించలేదని, అందువల్లే చొరబాట్లు కొనసాగుతున్నాయని ఆరోపించారు. 'అధికారం కోసం, ఓటు బ్యాంకు పెంచుకునేందుకు ఇవన్నీ చేస్తున్నారు. మీ తర్వాత మీ మేనల్లుడు సీఎం కావచ్చు. కానీ ఇదెంతమాత్రం కొనసాగనీయరాదు' అని అమిత్‌షా అన్నారు. బెంగాల్‌లో ఏళ్ల తరబడి కమ్యూనిస్ట్ పాలన నడిచిందని, ఆ తర్వాత 'మా, మాటీ, మానుష్' నినాదంతో మమతాబెనర్జీ అధికారంలోకి వచ్చారని, అయితే ఆమె నాయకత్వంలో బంగ్లా చొరబాట్లు, మహిళలపై నేరాలు, నేరపూరిత ఘటనలు, బాంబు పేలుళ్ల ఘటనలు పెరిగాయని అమిత్‌షా ఆరోపించారు. మమతా బెనర్జీ పగ్గాలు చేపట్టాక వందలాది మంది బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని, దీదీని సాగనంపే సమయం వచ్చిందని, 2026లో ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు
ముస్లింల ఓటు బ్యాంకు కోసమే ఆపరేషన్ సిందూర్, వక్ఫ్ సవరణ చట్టాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారు : అమిత్‌షా
June 01, 2025
0
Tags