తమిళనాడు నుంచి రాజ్యసభకు ఈనెల 19న జరుగనున్న ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను అన్నాడీఎంకే ఆదివారంనాడు ప్రకటించింది. ఐఎస్ ఇంబదురై, ఎం.ధనపాల్ ను పార్టీ అభ్యర్థులుగా నిర్ణయించినట్టు అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శఇ కేపీ మునుస్వామి ప్రకటించారు. ఈ ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఆమోదం తెలిపినట్టు చెప్పారు. తమ భాగస్వామ్య పార్టీ అయిన డీఎండీకేకు 2026లో రాజ్యసభ సీటు కేటాయిస్తామని అన్నారు. జూలై 24న ఖాళీ కానున్న 6 రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. రిటైర్ కానున్న సభ్యులలో ప్రముఖ నేతలు అన్బుమణి రామదాస్ (పీఎంకే), ఎండీఎంకే నేత వైకో ఉన్నారు. కాగా, ప్రస్తుతం అసెంబ్లీలోని బలాబలాల ప్రకారం 6 స్థానాల్లో 4 స్థానాలను డీఎంకే సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉండగా, తక్కిన రెండు సీట్లను బీజేపీ, మిత్రపక్షాల మద్దతుతో అన్నాడీఎంకే గెలుచుకునే వీలుంది.
రాజ్యసభకు అన్నాడీఎంకే అభ్యర్థులుగా ఇంబదురై, ఎం.ధనపాల్
June 01, 2025
0
Tags