ఓలాలో జీరో కమీషన్‌ మోడల్‌

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా క్యాబ్‌ సేవలందించే ఓలా సంస్థ జీరో కమీషన్‌ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై రైడ్‌ అనంతరం వచ్చే మొత్తంలో సంస్థకు కమీషన్‌ కింద ఎలాంటి మొత్తమూ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. డ్రైవర్లు తమకు నచ్చిన ప్లాన్‌ను ఎంచుకుని ఎలాంటి కోతలు, పరిమితులు లేకుండా ఆదాయాన్ని పొందొచ్చని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఓలా యాప్‌ను వినియోగించుకున్నందుకు గానూ 'సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సర్వీసు'లో భాగంగా కొంత మొత్తం ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆటోలు, బైక్‌ ట్యాక్సీలు, క్యాబ్‌లకు ఈ జీరో కమీషన్‌ విధానమే వర్తిస్తుందని స్పష్టంచేసింది. జీరో కమీషన్‌ మోడల్‌ వల్ల డ్రైవర్లకు మరింత ఆదాయం లభిస్తుందని ఓలా ప్రతినిధి పేర్కొన్నారు. అద్దె ప్రాతిపదికన క్యాబ్‌ సేవలందించే ఈ వ్యవస్థకు డ్రైవర్లే వెన్నెముక అని పేర్కొన్నారు. జీరో కమీషన్‌ విధానాన్ని దశలవారీగా అమల్లోకి తీసుకొచ్చామని కంపెనీ తెలిపింది. తొలుత ఓలా ఆటోలకు ఈ విధానాన్ని వర్తింపజేయగా తర్వాత బైక్‌ ట్యాక్సీ, ఇప్పుడు ఓలా క్యాబ్‌లకు సైతం ఈ విధానాన్నే అమలు చేస్తున్నామని పేర్కొంది. అదే సమయంలో ప్రయాణికుల భద్రతకూ కట్టుబడి ఉన్నామని ఓలా స్పష్టంచేసింది. డ్రైవర్‌ బ్యాగ్రౌండ్‌ తనిఖీ, వాహన ప్రమాణాలు, ఇన్‌-యాప్‌ ఎమర్జెన్సీ ఫీచర్‌ వంటివి కొనసాగుతాయని స్పష్టంచేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)