కాంగ్రెస్ నేతలకు, కాంగ్రెస్ పార్టీతో సీనియర్ ఎంపీ శశి థరూర్ మధ్య కౌంటర్లు, చురకలు నిరంతరం కొనసాగుతున్నాయి. పార్టీలో తనపై వస్తున్న విమర్శలను ఉద్దేశిస్తూ థరూర్ నిన్న 'పక్షిని స్వేచ్ఛగా ఎగరనివ్వాల'ని అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు. దానికి నేడు మరో సీనియర్ ఎంపీ స్పందిస్తూ 'రాబందులు ఉంటాయి జాగ్రత్త' అని పరోక్షంగా హెచ్చరించారు. ప్రధాని మోడీని ప్రశంసిస్తూ ఇటీవల శశిథరూర్ ఓ కాలమ్ రాశారు. దీనికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందిస్తూ కొందరికి మోడీనే ప్రాధాన్యం అంటూ విమర్శలు గుప్పించారు. దీనికి కౌంటర్‌గా థరూర్ బుధవారం సాయంత్రం ఓ పక్షి ఫొటో షేర్ చేశారు. ''ఎగరడానికి ఎవరి అనుమతి అడగకు. రెక్కలు నీవి. ఆకాశం ఎవరి సొంతం కాదు'' అనే సందేశాన్ని పంచుకున్నారు. ఖర్గే వ్యాఖ్యలు, పార్టీలో తనపై వస్తోన్న విమర్శలకు బదులుగానే ఈ పోస్ట్ చేశారని ప్రచారం మొదలైంది. ఇది కాస్తా నెట్టింట చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే థరూర్ పోస్ట్‌ను పరోక్షంగా ఉద్దేశిస్తూ తాజాగా కాంగ్రెస్ సీనియర్ ఎంపీ మాణికం ఠాగూర్ తన 'ఎక్స్' ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ''ఎగరడానికి అనుమతి అడగొద్దు. పక్షులు రెక్కలు విరుచుకునేందుకు ఎవరి ఆమోదం అక్కర్లేదు. కానీ, ఈ రోజుల్లో స్వేచ్ఛగా ఎగిరే పక్షి కూడా ఆకాశాన్ని నిశితంగా గమనిస్తూ ఉండాల్సిందే. గద్దలు, రాబందులు ఎల్లప్పుడూ వేటాడుతూనే ఉంటాయి. స్వేచ్ఛ ఎప్పటికీ ఉచితంగా రాదు'' అని రాసుకొచ్చారు.
రాబందులు ఉంటాయి జాగ్రత్త : శశిథరూర్ 'పక్షి' పోస్ట్‌కు కాంగ్రెస్ చురక
June 26, 2025
0
Tags