నాన్‌ ట్యాక్స్‌ రెవెన్యూపై అధికారులు దృష్టిపెట్టాలి !

Telugu Lo Computer
0


తెలంగాణలో నాన్‌ ట్యాక్స్‌ రెవెన్యూ రాబడులను పెంచడంపై అధికారులు దృష్టి సారించాలని ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ అండ్‌ క్యాపిటల్‌ సబ్‌ కమిటీ ఛైర్మన్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆదివారం సచివాలయంలో జరిగిన అసెట్స్‌ సబ్‌ కమిటీ మంత్రివర్గ ఉప సంఘం భేటీలో మంత్రులు, కమిటీ సభ్యులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వ పథకాలను ఒక్కటి కూడా ఆపకుండా కొత్తగా రూ.33,600 కోట్ల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ''అధికారంలోకి వచ్చిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి ఓఆర్‌ఆర్‌, ఎక్సైజ్‌ ఆదాయాలు రాకుండా పోయాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ కానుక, మహాలక్ష్మి, ఉచిత కరెంట్‌, ఇందిరమ్మ ఇళ్లు సహా పలు కొత్త పథకాలను ప్రజలకు అందిస్తున్నాం. బడ్జెట్‌ నిధులు కొన్ని శాఖలు అధికంగా మరికొన్ని శాఖలకు తక్కువగా అందుతున్నాయి. బడ్జెట్‌లో అన్ని శాఖలకు సమానంగా పంచాలి. శాఖల మధ్య ఖర్చు అంతరాలను తగ్గించి.. అన్నింటినీ ఒకే స్థాయిలోకి తీసుకురావాలి. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన ప్రాజెక్టుల ప్రాముఖ్యతను అనుసరించి వెంటనే పూర్తి చేయాలి. రాష్ట్ర అవసరాలు, ప్రాముఖ్యతల మేరకు బడ్జెట్‌ నిధులు ఖర్చు చేయాలి. రెవెన్యూ తీసుకువచ్చే శాఖలు, విభాగాలపై దృష్టి సారించాలి. పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌, అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రజాప్రభుత్వం ఆలోచనల మేరకు అందరూ పనిచేయాలి. అన్ని శాఖలు సమానంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం సంపూర్ణ స్థాయిలో ముందుకు వెళ్తుంది. రాబోయే పది రోజుల్లో రేషనలైజేషన్‌ పూర్తి చేసి సమగ్రమైన ప్రణాళికలు రూపొందించాలి''అని అధికారులకు భట్టి విక్రమార్క దిశానిర్దేశం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)