భర్త రాజా రఘువంశీని పక్కా ప్లాన్‌తో చంపించిన భార్య సోనమ్ హత్య తర్వాత ఇందౌర్‌కు వచ్చి తన ప్రియుడిని కలిసినట్లు మధ్యప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. వీరిద్దరూ ఓ గద్దెలో ఉన్నారని, అక్కడే పారిపోయేందుకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన ఈ జంట మే 23 నుంచి అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని గుర్తించగా, కన్పించకుండా పోయిన సోనమ్ ఉన్నట్టుండి ఉత్తరప్రదేశ్‌లో ప్రత్యక్షమైంది. తనను ఎవరో కిడ్నాప్ చేసి, గాజీపుర్‌లో వదిలిపెట్టారని ఆమె ఆరోపించింది. అయితే, అవన్నీ అవాస్తవాలేనని మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపారు. ''మే 25-27 మధ్య సోనమ్ రైలులో ఇందౌర్‌కు వచ్చింది. దేవాస్ గేట్‌లోని ఓ అద్దె గదికి చేరుకున్నట్లు మాకు సమాచారం అందింది. అక్కడే తన ప్రియుడు రాజ్ కుశ్వాహాను కలుసుకుంది. ఆ తర్వాత వీరిద్దరూ పారిపోయేందుకు ప్లాన్ చేశారు. ఓ ట్యాక్సీ మాట్లాడి సోనమ్‌ను యూపీకి పంపించాడు'' అని అదనపు డీసీపీ రాజేశ్ దండోటియా వెల్లడించారు. అయితే, యూపీకి ఎందుకు వెళ్లిందన్న దానిపై స్పష్టత లేదని పోలీసులు తెలిపారు. బహుశా కేసును తప్పుదోవ పట్టించడం కోసమే ఆమె గాజీపుర్‌కు వెళ్లి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. హత్య తర్వాత మేఘాలయ నుంచి ఆమె రైలులో గువాహటికి అక్కడి నుంచి పట్నాకు వెళ్లినట్లు గుర్తించారు. కాగా రాజ్ కుశ్వాహాతో సోనమ్‌కు సంబంధం గురించి ఆమె ఇంట్లో వాళ్లకు ముందే తెలుసని రాజా రఘువంశీ సోదరుడు విపిన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ''రాజ్‌తో ప్రేమ గురించి సోనమ్ తల్లికి చెప్పి రఘువంశీని పెళ్లి చేసుకోనని చెప్పింది. కానీ, ఆమె అందుకు అంగీకరించలేదు. బలవంతంగా నా సోదరుడితో పెళ్లికి ఒప్పించారు. అప్పుడు సోనమ్ తన తల్లిని బెదిరించింది. 'పెళ్లి అయితే చేసుకుంటాను గానీ ఆ తర్వాత అతడిని (రాజా రఘువంశీ) ఏం చేస్తానో చూడు. మీరు అవన్నీ భరించాల్సిందే' అని సోనమ్ చెప్పినట్లు మాకు తెలిసింది'' అని విపిన్ పోలీసులకు తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన నిందితుల్లో సోనమ్ మినహా మిగతా నలుగురు తమ నేరాన్ని అంగీకరించినట్లు ఇందౌర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. రాజా రఘువంశీని చంపే సమయంలో సోనమ్ అక్కడే ఉందని, ఘటనను చూసిందని నిందితులు చెప్పినట్లు తెలిపారు. ఘటన సమయంలో రాజ్ కుశ్వాహా ఇందౌర్‌లోనే ఉన్నాడు. మిగతా ముగ్గురు ప్రయాణ ఖర్చులకు ఇతడే డబ్బులు సమకూర్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. రాజా రఘువంశీతో పెళ్లి నచ్చని సోనమ్ పెళ్లయిన నాలుగు రోజులకే పుట్టింటికి వెళ్లి అక్కడ రాజ్ కుశ్వాహాతో మాట్లాడినట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత వీరిద్దరూ రఘువంశీ హత్యకు కుట్ర చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ కేసులో అరెస్టయిన సోనమ్‌ను షిల్లాంగ్‌కు తీసుకొచ్చారు. ఈరోజు ఆమెను కోర్టులో హాజరుపర్చనున్నారు.
రఘువంశీ హత్య తర్వాత అద్దె గదిలో ప్రియుడిని కలిసిన సోనమ్ !
June 11, 2025
0
Tags